కనువిందు చేస్తున్న.. ఏనుగుదంతం చెట్లు

15 Jun, 2018 12:10 IST|Sakshi
బృందావన ప్యాలెస్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఏనుగుదంతం చెట్లు 

ఆకర్షితులవుతున్న చూపరులు

పర్లాకిమిడి : మహేంద్రతనయ వద్ద ఉన్న బృందావన ప్యాలెస్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న అతి పురాతన ఏనుగుదంతం చెట్లు చూపరులు, వ్యాయామానికి వెళ్లే పాదచారులకు కనువిందు చేస్తున్నాయి. అప్పట్లో కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్‌ జమిందారీ హయాంలో  ఈ ఏనుగుదంతం మొక్కలను బీఎన్‌.ప్యాలెస్‌ రోడ్డుకు ఇరువైపులా నాటించారు.

160 ఏళ్లకు పైగానే ఈ చెట్లు జీవించాయి. ప్రపంచంలో అతి ఎక్కువ కాలం జీవించే చెట్టు ఇదే. ఈ చెట్టుకు కాయలు కాస్తాయి. వాటిలో పుష్కలంగా విటమిన్స్, ఐరన్‌ ఉంటాయి. ఈ కాయల్లో లభించే పప్పు అతి ఎక్కువగా తినరాదని బొటానికల్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీటిలో కొన్ని చెట్లు నేలకొరగగా మరికొన్ని చెట్లు ఇప్పుటికీ జీవించేఉన్నాయి. రాజావారి కోట ఎడమ వైపున సంస్థానం గుర్రపుశాల ప్రాంగణంలో కూడా ఏనుగుదంతం చెట్లు ఉన్నాయి. ఎటువంటి గాలివానలనైనా తట్టుకుని నిలబడే ఈ చెట్లు భూమిలో చాలా మీటర్ల లోతుకు వీటి వేర్లు పాతుకుపోతాయి.

పాదచారులకు నీడనివ్వడమే కాకుండా కాయలు కూడా ఇస్తున్నాయి. బృందావనం ప్యాలెస్‌లో ఇలాంటి అరుదైన చెట్లు పదులకొద్దీ ఉన్నాయి. వాటి ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో కొందరు దుండగులు చెట్లను నరికి తీసుకుపోతున్నారు.

బృందావనం ప్యాలెస్‌ చుట్టూ ఇప్పుడిప్పుడే కంచె వేయడంతో చెట్ల నరికివేతను కొంతవరకు అరికడుతున్నారు. ప్రస్తుతం టూరిస్టులకు, ఒడియా చలనచిత్ర దర్శక నిర్మాతలను షూటింగ్‌ల నిమిత్తం బృందావన ప్యాలెస్‌లోకి అనుమతిస్తున్నారు.

మరిన్ని వార్తలు