బీఎడ్‌.. గో ఎహెడ్‌

13 Feb, 2019 02:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అభ్యర్థులకు ఎస్‌జీటీ అర్హత

ఉద్యోగం వస్తే రెండేళ్లలోగా బ్రిడ్జి కోర్సు చేయాలి కేంద్రం స్పష్టీకరణ

దీనికనుగుణంగానే సీ–టెట్‌ నోటిఫికేషన్‌

రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం 

పేపర్‌–1 పరీక్ష రాసేందుకు మార్గం సుగమం

డిగ్రీ, డీఎడ్‌ చేసిన వారు 6, 7, 8 తరగతుల బోధనకూ అర్హులే 

వచ్చే నెల 5 వరకు సీ–టెట్‌కు దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు కూడా బీఎడ్‌ అభ్యర్థులకు అర్హత కల్పించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్‌ నిబంధనలను ఇటీవలే సవరించింది. బీఎడ్‌ అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్‌ టీచర్‌గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలన్న షరతు విధించింది. దీంతో 2011లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను అమల్లోకి తెచ్చినప్పుడు విధించిన నిబంధన కారణంగా ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్‌ పోస్టులకు దూరమైన బీఎడ్‌ అభ్యర్థులు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలు ఏర్పడింది.  

సీ–టెట్‌ నుంచే అమలు.. 
డిగ్రీతోపాటు బీఎడ్‌ చేసిన అభ్యర్థులను ప్రైమరీ టీచర్‌ పోస్టులకు అర్హులను చేస్తూ మార్పు చేసిన విధానాన్ని జూలై 7న నిర్వహించనున్న సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) నుంచే అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా మార్పులతో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇటీవల సీ–టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్‌సీటీఈ షరతుకు లోబడి డిగ్రీతోపాటు బీఎడ్‌ చేసిన వారు ప్రైమరీ టీచర్‌ పోస్టులకు, 6, 7, 8 తరగతులకు బోధించే ఎలిమెంటరీ టీచర్‌ (స్కూల్‌ అసిస్టెంట్‌) పోస్టులకు అర్హులుగా పరిగణనలోకి తీసుకునేలా సీ–టెట్‌ నిబంధనలను పొందుపరిచింది.

దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రైమరీ టీచర్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌తోపాటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) చేసిన వారు, డీఎడ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వారు, నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీఈఎల్‌ఈడీ) చివరి సంవత్సరం, డీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) చివరి సంవత్సరం చదువుతున్న వారంతా అర్హులే. వారితోపాటు తాజాగా డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి బీఎడ్‌ పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని నోటిఫికేషన్‌లో ఎన్‌సీటీఈ వెల్లడించింది. దీంతో బీఎడ్‌ అభ్యర్థులు కూడా టెట్‌ పేపర్‌–1 పరీక్ష రాసేందుకు అర్హులయ్యారు. మరోవైపు 6వ తరగతి నుంచి 8వ తరగతికి బోధించే టీచర్‌ పోస్టులకు డిగ్రీతోపాటు బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీతో డీఎడ్‌ పూర్తయిన వారు, ఇంటర్మీడియెట్‌తో నాలుగేళ్ల బీఈఎల్‌ఈడీ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్‌ ఇయర్‌ వారు, ఇంటర్మీడియెట్‌తో ఇంటిగ్రీటెడ్‌ బీఎడ్‌ (బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ) పూర్తి చేసిన వారంతా అర్హులేనని పేర్కొంది.

అలాగే డీఎడ్‌ చేసిన వారికి డిగ్రీ ఉంటే వారు కూడా 6, 7, 8 తరగతుల బోధనకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంది. దీంతో వారు కూడా టెట్‌ పేపర్‌–2 పరీక్ష రాయవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిగ్రీతో డీఎడ్‌ చేసిన వారిని టెట్‌ పేపర్‌–2కు పరిగణనలోకి తీసుకోవట్లేదు. అయితే తమను పేపర్‌–2కు పరిగణనలోకి తీసుకోవాలని డిగ్రీతో డీఎడ్‌ చేసిన అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సీ–టెట్‌ దరఖాస్తుల స్వీకరణను సీబీఎస్‌ఈ ప్రారంభించింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సబ్మిషన్‌కు, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. 

2010కి ముందు అర్హత ఉన్నా..
ఎన్‌సీటీఈ 2010లో టెట్‌ నిబంధనలను జారీ చేయకముందు ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను కూడా అర్హులుగానే పరిగణన లోకి తీసుకునేవారు. అయితే బీఎడ్‌ అభ్యర్థులకు చైల్డ్‌ సైకాలజీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సబ్జెక్టు లేనందున వారిని పరిగణనలోకి తీసుకోవద్దని డీఎడ్‌ అభ్యర్థులు అంతకు ముందే కోర్టులో కేసు వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు డీఎడ్‌ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో బీఎడ్‌ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనర్హులుగా ఎన్‌సీటీఈ ప్రకటించింది. ఆ తరువాత టెట్‌ రావడంతో అందులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు 
బీఎడ్‌ అభ్యర్థులు అర్హులు కాదన్న నిబంధన విధించింది. 

కేవలం 6, 7, 8 తరగతులకు బోధించేందుకే బీఎడ్‌ వారు అర్హులని పేర్కొంది. దీంతో బీఎడ్‌ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పైగా రాష్ట్రంలో ప్రస్తుతం బీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు 5 లక్షల మందికిపైగా ఉంటే డీఎడ్‌ పూర్తి చేసిన వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు అనేకసార్లు కేంద్రం 
దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో కేంద్రం వారికి అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.  

మరిన్ని వార్తలు