ఒక్క ఫోటో.. ఎంత పని చేసింది

31 Jul, 2018 15:57 IST|Sakshi

జైపూర్‌: సోషల్‌ మీడియాలో ఫేక్‌ కథనాల నిర్మూలనపై చర్చ విస్తృతంగా సాగుతున్న వేళ.. రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఒళ్లో అందమైన చంటి బిడ్డను పట్టుకున్న ఓ బిచ్చగత్తె ఫోటో రెండు వారాల నుంచి వైరల్‌ అయ్యింది. దీంతో ఆమె పిల్లలను ఎత్తుకుపోయే మహిళ అన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఎట్టకేలకు ఓ ఎన్నారై మహిళ చొరవతో అదంతా ఉత్తదేనని తేలింది. 

వివరాల్లోకి వెళ్తే... జోధ్‌పూర్‌లోని శనీశ్వరుడి గుడి వెలుపల ఓ మహిళ బిక్షమెత్తుకుంటోంది. ఆమె పక్కింట్లో ఉండే మహిళ చెత్త ఎరుకుని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు సదరు మహిళ తన బిడ్డను గుడి వద్ద ఉన్న మహిళకు అప్పగించి బయటకు వెళ్లింది. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. బిడ్డ అందంగా ఉండటం.. పైగా డైపర్‌ వేసి ఉండటంతో సదరు బిక్షగత్తెను పిల్లలను అపహరించే బాపతంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున్న జరిగింది.

ఇదిలా ఉండగా రోహిణి షా అనే మహిళ జోధ్‌పూర్‌ పోలీసులకు ఆ కథనాన్ని ట్యాగ్‌ చేయటంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. చివరకు ఆ మహిళను, బిడ్డ తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగు చూసింది. ఈ వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలించి త్వరగా తేల్చేసిన పోలీసులను జోధ్‌పూర్‌ డీసీపీ అమన్‌ సింగ్‌ అభిందనందించారు.  ఆలస్యం అయ్యి ఉంటే ఆ మహిళ పరిస్థితి ఏమైయ్యేదోనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు