బైకుల్లా జైలు.. ఓ భయంకర నిజం

27 Jun, 2017 15:09 IST|Sakshi
బైకుల్లా జైలు.. ఓ భయంకర నిజం
ముంబయి: కూతురుని హత్య చేయించిన నేరంకింద ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా ఉంటున్న ముంబయిలోని బైకుల్లా జైలులో రెండు రోజుల కిందట జరిగిన సంఘటనకు సంబంధించి ఓ భయంకర నిజం వెలుగులోకి వచ్చింది. ఆ జైలులోని మహిళా విభాగం హెడ్‌ మనిషా పోకార్కర్‌ చేతుల్లో చావుదెబ్బలు తిని ప్రాణాలు విడిచిన ఓ మహిళా ఖైదీపై అత్యంత అమానవీయ దాడి జరిగిందని తెలిసింది. ఆమెను క్రూరంగా వేధించారని, లైంగిక వేధింపులకు గురిచేశారని తెలిసింది.

దాదాపు హత్య చేసినట్లుగా పోకార్కర్‌ వ్యవహరించారని, ఓ బ్యాటన్‌తో ఆ మహిళను బయటకు చెప్పలేనంత దారుణంగా హింసించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బైకుల్లా జైలులో రెండు రోజులుగా దాదాపు 200మంది మహిళా ఖైదీలు ఆందోళన చేస్తున్నారు. అందులో జీవితకారగార శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని మనిషా పోర్కర్‌ అత్యంత దారుణంగా కొట్టి అమానవీయంగా వ్యవహరించారు. భోజనం చేసే సమయంలో ఆ ఖైదీ రెండు కోడుగుడ్లు దొంగిలించిందనే కారణంతోనే ఆమెపై చేయి చేసుకొని హింసించారు. దీంతో తీవ్ర గాయాలపాలయిన ఆ యువతి ప్రాణాలుకోల్పోయింది.

ఈ సంఘటనకు బాధ్యులను చేస్తూ జైలు అధికారులను సస్పెండ్‌ చేశారు. మహిళా ఖైదీని బ్యాటన్‌తో లైంగికంగా వేధించిన విషయం బయటకు రావడంతో తమ ప్రాణాలకు ఇక ఎక్కడ రక్షణ ఉంటుందని ఖైదీలంతా వాపోతున్నారు. ఈ చర్యకు పాల్పడిన పోకార్కర్‌పై కఠిన చర్యలు తీసుకోలేకుంటే తమ క్లెయింట్‌ ఇంద్రాణీని వేరే జైలుకు తరలించాలంటూ ఆమె తరుపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. మొత్తానికి బైకుల్లా జైలు ఘటన పెద్ద దుమారమే రేపుతోంది.
>
మరిన్ని వార్తలు