కర్ణాటక హత్యల్లో షాకింగ్‌ మలుపులు

20 Mar, 2018 18:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అది కర్ణాటక రాష్ట్రం, కాలాబురిగి జిల్లాలోని ఉప్పర హట్టి గ్రామం. రామ్‌నగర్‌ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేస్తున్న వందన మహదేవ్‌ ఆ గ్రామంలోని ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. ఓ మీడియా ప్రతినిధి ఆమెను కలుసుకునేందుకు ఇటీవల ఆ గ్రామానికి వెళ్లారు. ఆమె భర్త మహదేవ్‌ కాలే ఆమెకు ముందు రామ్‌నగర్‌ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. 2016, నవంబర్‌ నెలలో ఆమె భర్తను గుర్తుతెలియని వ్యక్తులు ఊరు శివారులో చంపేశారు. ర్యాడికల్‌ ముస్లింలు ఆమె భర్తను ఎలా చంపేశారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. కాసేపు నోటి నుంచి మాటరాకుండా మ్రాన్పడి పోయారు.

మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటక రాష్ట్రంలో 2014, మార్చి నెల నుంచి 2017, జూన్‌ నెల వరకు 23 మంది హిందువులను జిహాది శక్తులు హత్య చేశాయని ఆరోపిస్తూ ఉడుపి చిక్కమగలూరు నియోజకవర్గం బీజేపీ ఎంపీ శోభా కరండ్లాజే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఓ లేఖ రాశారు. అందులో హత్యలకు గురైన 23 మంది పేర్ల జాబితాను పొందుపర్చారు. ఆ జాబితాలో 21వ పేరు మహదేవ్‌ కలేది. హతులంతా బీజేపీ లేదా దాని మాతృసంస్థ అయిన ఆరెస్సెస్‌కు చెందిన వారని, వారిని ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా లేదా కర్ణాటక ఫోరమ్‌ ఫర్‌ డిగ్నిటీ’ సంస్థలకు చెందిన సభ్యులు హతమార్చారని బీజేపీ మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పకు సన్నిహితులైన శోభా కరండ్లాజే ఆరోపించారు. ఈ రెండు సంస్థల కూడా ముస్లింలవే.


మహదేవ్‌ కాలే భార్య వందన మహదేవ్‌

‘ఇటీస్‌ బ్లడ్‌ బాత్‌ ఇన్‌ కర్ణాటక’ అనే పెద్ద అక్షరాలతో అండర్‌లైన్‌ చేసి మరీ కరండ్లాజే జూలై 8, 2017వ తేదీతో కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. ఈ మరణాలపై నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని యడ్యూరప్ప కేంద్రాన్ని డిమాండ్‌ కూడా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో ఇక్కడికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ హత్యల గురించి ప్రస్తావించారు. ఆయన ఫిబ్రవరి ఐదవ తేదీన బెంగళూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘అతి సులువుగా వ్యాపారం చేసే పరిస్థితులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే ఇక్కడేమో అతి సులువుగా హత్యలు చేస్తున్నారు’ అని అన్నారు.

ఈ నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు ఓ మీడియా ఇటీవల కర్ణాటకలో పర్యటించింది. అందులో భాగంగా ఉప్పర హట్టి గ్రామంలో వందన మహదేవ్‌ను కలుసుకొని ఆమె భర్త హత్య గురించి వాకబు చేసింది. ర్యాడికల్‌ ముస్లింలు హత్య చేశారా? అని ప్రశ్నించగానే దిగ్భ్రాంతికి గురైన ఆమె కాసేపటికి తేరుకొని ‘ముస్లింలతో మాకిక్కడ ఎలాంటి సమస్యలు లేవు. ఇరుగుపొరుగు లాగానే కలిసి మెలసి ఉంటున్నాం. మా ఆయన్ని చంపిందీ రాజకీయ ప్రత్యర్థులు. మా ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడు. హంతకులు కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం ఉన్నవారు’ అని యాభై ఏళ్ల పైబడిన వందన తెలిపారు. నవంబర్‌ 3, 2016లో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులను అమోఘ్‌సిద్ద, భీమష యాదవ్, న్యాను, గోపుగా పేర్నొన్నారు. వీరంతా ఆదివాసి కమ్యూనిటీకి చెందిన వారే. అదే కమ్యూనిటికి చెందిన మహదేవ్‌ కాలేతో ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నాయి.


బీజేపీ ఎంపీ కేంద్రానికి సమర్పించిన హత్యల జాబితా

బీజేపీ ఎంపీ పేర్కొన్న మొత్తం 23 హత్యల్లో ఒకరు బ్రతికే ఉన్నారు. 13 హత్యలతో ముస్లిం సంస్థలకుగానీ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. హత్యకు గురైన వారిలో కొందరికి   చనిపోయే వరకు కూడా బీజేపీకిగానీ ఆరెస్సెస్‌కుగానీ ఎలాంటి సంబంధాలు లేవు. ముస్లింలకు ప్రమేయం ఉన్న హత్యల్లో కూడా రెండంటే రెండే హత్యలు మత విద్వేషాలకు సంబంధించినవి. అవి కూడా పశువులను అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారంటూ గోరక్షకులు చేసిన దాడికి ప్రతీకారంగా జరిగినవే. రాజకీయాలు, ఎన్నికలు, రియల్‌ స్టేట్, ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల కారణంగానే ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. రెండు ఆత్మహత్యలు, ఆస్తి కోసం అన్నను చంపించిన చెల్లిలు, రియల్టర్‌ గొడవల వల్ల బీజేపీ సభ్యుడిని బీజేపీ సభ్యుడే హత్య చేసిన ఉదంతాలు బీజేపీ ఎంపీ పేర్కొన్న జాబితాలో ఉన్నాయి. ఒక్కో హత్యలో ఒక్కో సినిమాను తీసేంత డ్రామా ఉంది.

హత్యలకు గురైన వారిలో ఎక్కువ మంది మధ్య తరగతి, పేద కుటుంబాలకు, నిమ్న కులాలకు చెందిన వారే. హత్యలను నివారించడంలోగానీ, నేరస్థులకు సకాలంలో శిక్షలు విధించడంలోగానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమవుతోందని బాధిత కుటుంబాలు విమర్శిస్తున్నాయి. ఎక్కువ కేసుల్లో నిందితులు బెయిల్‌పై రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతుండటమే అందుకు కారణం.
 


బతికే ఉన్న అశోక్‌ పూజారి

కార్తీక్‌ రాజ్, 26 ఏళ్లు
మంగళూరు జిల్లా కొనాజీ గ్రామానికి చెందిన కార్తీక్‌ రాజ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌. ఉద్యోగం చేరిన కొన్ని రోజులకే అంటే, 2016 అక్టోబర్‌ నెలలో హత్యకు గురయ్యారు. బాడీ ఫిట్‌నెస్‌ పట్ల ఎక్కువ మక్కువ కలిగిన కార్తీక్‌ రాజ్‌ ప్రతిరోజూ జాగింగ్‌కు వెళతాడని, అక్టోబర్‌ 23వ తేదీన అలా వెళ్లిన తన కుమారుడికి యాక్సిడెంట్‌ అయిందని, స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు ఫోన్‌ వచ్చిందని ఆయన తండ్రి ఉమేష్‌ గానిగ తెలిపారు. తాము ఆస్పత్రికి వెళ్లేలోగానే తన కుమారుడు చనిపోయాడని చెప్పారు. ఉమేష్‌ గానిగ గతంలో బీజేపీ నాయకుడు అవడం వల్ల బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్తీక్‌ రాజ్‌ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ర్యాడికల్‌ ముస్లింలే హత్య చేశారంటూ నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా వచ్చి ఉమేష్‌ గానిగ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారం రోజులకు గానీ అసలు విషయం వెలుగులోకి రాలేదు.

ఓ వీడియోలో నిందితులను గుర్తించాల్సి ఉందంటూ రాజ్‌ సోదరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కూతురు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తండ్రి ఉమేష్‌ గానిగ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే సోదరుడి హత్యకు కుట్రపన్నారనే ఆరోపణపై ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజ్‌ సోదరికి పెళ్లయింది. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అది తెల్సి రాజ్, సోదరిని తీవ్రంగా హెచ్చరించారు. తన భర్తకు, ఇంట్లోవారికి తెలియకుండా రాజ్‌ను ఎక్కడికైనా కనిపించకుండా తీసుకెళ్లాలని ఆమె తన ప్రియుడిని కోరింది. ఆ ప్రియుడు మరో స్నేహితుడితో కలిసి కళ్లలో కారం చల్లి రాజ్‌ను కొట్టి చంపారు. తన కూతురు రాజ్‌ను చంపేంత క్రూరురాలు కాదని, రాజ్‌ను బెదిరించమంటే చంపేసి ఉంటారని ఉమేష్‌ అన్నారు.

‘1995 నుంచి 2000 సంవత్సరం వరకు బీజేపీ సభ్యుడిగా తాలూకా రాజకీయాల్లో పాల్గొన్నాను. ఎప్పుడో రాజకీయాలను వదిలేశాను. నా కుమారుడికి ఏ రాజకీయ పార్టీతోగానీ, సంస్థతోగానీ సంబంధం లేదు. మా ఇంటి పక్కవారు కూడా ముస్లింలే. మేమంతా ప్రశాంతంగానే ఉంటున్నాం. నా కుమరుడు, నా కూతురు ఇలా దూరం అవడం నా దురదష్టం’ అంటూ ఉమేష్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.


కార్తీక్‌ రాజ్‌

మూడబిద్రి హత్యల గురించి....
ఇక మూడబిద్రిలో ముగ్గురిని ముస్లిం ర్యాడికల్స్‌ చంపేశారని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. వారిలో ఒకకు బతికే ఉండగా, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలోని మూడబిద్రి శివారులో ఉండే అశోక్‌ పూజారి బతికే ఉన్నారు. సెప్టెంబర్‌ 20, 2015లో ఆరుగురు వ్యక్తులు ఆయనపై మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో మూడు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న అశోక్‌ పూజారి ఆ తర్వాత విడుదలయ్యారు. భజరంగ్‌ దళ్‌కు చెందిన అశోక్‌ పూజారి ఆస్పత్రి చికిత్సకు 8 లక్షల రూపాయలు ఖర్చుకాగా, అందులో కొంత భజరంగ్‌ దళ్‌ సంస్థ చెల్లించిందని ఆయన చెప్పారు. ఆయనపై దాడి చేసిన వారిలో ముస్తఫా 28, హనీఫ్‌ 26, కబీర్‌ 28లను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.

నిందితులు తనపై పొరపాటున దాడి చేశారని, తనను ప్రశాంత్‌ పూజారి అనుకొని దాడి చేశారని ఆయన తెలిపారు. ఆ మరుసటి నెల అక్టోబర్‌ 6, 2015న  భజరంగ దళ్‌కు చెందిన 29 ఏళ్ల ప్రశాంత్‌ పూజారి  దుకాణం నుంచి బయటకు వస్తుండగా మూడు బైకులపై వచ్చిన ఆరుగురు సభ్యుల ముఠా మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసింది. అశోక్‌ పూజారిపై దాడి చేసిన ముస్లిం యువకులే ఈ హత్య చేయడంతో వారు సులభంగానే పోలీసులకు చిక్కి పోయారు. గోసంరక్షనకు కృషి చేయడం వల్లనే ముస్లిం యువకులతోని తన కుమారుడికి గొడవలు మొదలయ్యాయని ప్రశాంత్‌ పూజారి తంత్రి ఆనంద్‌ పూజారి తెలిపారు.

ప్రశాంత్‌ పూజారి హత్య జరిగిన వారం రోజులకే అంటే, అక్టోబర్‌ 15వ తేదీన (2015) ఆయన స్నేహితుడు వామన పూజారి దొడ్లో ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించాడు. ఆయన్ని ముస్లిం ర్యాడికల్స్‌ చంపి ఉరేశారని ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని, తన భర్త ఉరేసుకొనే చనిపోయాడని ఆయన భార్య సరోజిని పూజారి తెలిపారు. హిందూ సంఘాలతో సంబంధం ఉందని, ముస్లింలు చంపారని ఆరోపించాల్సిందిగా ఆరెస్సెస్‌ కార్యకర్తలు తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పారన్నారు. ఏ సంస్థతతోని తన భర్తకు సంబంధం లేదని, ప్రశాంత్‌ పూజారి హత్యను చూశాడన్న కారణంగా, తనను ముస్లింలు ఎక్కడ చంపుతారోనని అస్తమానం బాధ పడేవారని, సరిగ్గా తిండి కూడా తినేవారు కాదని ఆమె వివరించారు.


మంజూనాథ్‌ భార్య లక్ష్మీ

శివమొగ్గలో ఫిబ్రవరి 19 (2015)
శివమొగ్గలో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో నిషేధాజ్ఞలు విధించారు. రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి 21వ తేదీన మంజునాథ్‌ శెట్టి శవం ఓ గోనె సంచిలో దొరికింది. పీఎఫ్‌ఐ కార్యకర్తలు హత్యచేశారని ప్రచారం జరిగింది. ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ, ఆరెస్సెస్‌లు నిరసన ప్రదర్శనలు కూడా జరిపారు. ఈ కేసులో కొంత మంది ముస్లిం యువకులను అరెస్ట్‌ చేసి విచారించారు. దాదాపు రెండేళ్ల తర్వాత కేసు చిక్కు ముడి వీడింది. ఆస్తి కోసం మంజునాథ్‌ను ఆయన అక్కనే చంపించిందని మంజునాథ్‌ భార్య లక్ష్మి తెలిపింది. మంజునాథ్‌ ఆస్తి తాలూకు డాక్యుమెంట్లను బ్యాంకులో పెట్టి ఆయన అక్క రుణాలు తీసుకొందని, డాక్యుమెంట్లు తీసుకు వచ్చి ఇవ్వాల్సిందిగా మంజునాథ్‌ ఒత్తిడి చేయగా, ఇస్తానని ఇంటికి పిలిచి చంపించిందని లక్ష్మి వివరించారు. కేసు చార్జిషీటులో కూడా ఇదే విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు.

బీజేపీ వర్సెస్‌ బీజేపీ
బళ్లారి జిల్లా గుగ్గర హట్టి గ్రామానికి చెందిన బండి రమేశ్‌ బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు. భూ ఆక్రమణదారుగా, రౌడీ షీటర్‌గా ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. ఆయన్ని 2017, జూన్‌ 22వ తేదీన 20 మంది దాడిచేసి హత్య చేశారు. దాడిచేసిన వారంతా హిందువులే. వారిని తీసుకొచ్చిన వాహన డ్రైవర్‌ ఒక్కడే ముస్లిం. అతనితో సహా మొత్తం 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు జగదీశ్‌ అలియస్‌ జగ్గా. బీజీపీ సభ్యుడు. రమేశ్‌కు ఆయన ఎప్పటి నుంచో ప్రత్యర్థి. భూ దందాలో ఇద్దరు పలుసార్లు గొడవలు పడ్డారు. ఇలా ఒక్కో కేసును చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా ఎంతో ఉంది.  ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే యడ్యూరప్ప డిమాండ్‌ చేసినట్లుగా బీజేపీ ఎంపీ సమర్పించిన జాబితాపై ఎన్‌ఐఏతో కేంద్రం తప్పనిసరిగా దర్యాప్తు చేయించాల్సిందే.

(సాక్షి వెబ్‌ సైట్‌ ప్రత్యేకం)

>
మరిన్ని వార్తలు