కేంద్రం, జాతీయ మీడియా పట్ల ఆగ్రహం

23 May, 2020 19:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ పెను తుపాను ‘ఉంపన్‌’ సృష్టించిన బీభత్సం గురించి కేంద్ర ప్రభుత్వంగానీ, జాతీయ మీడియాగానీ అంతగా పట్టించుకోక పోవడం పట్ల మేధావులతోపాటు సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలసి ఏరియల్‌ సర్వే చేసి తుపాను బీభత్సాన్ని ప్రత్యక్షంగా వీక్షించినా ‘జాతీయ విపత్తు’గా ప్రకటించక పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ, ప్రముఖ జర్నలీస్ట్‌ వీర్‌ సాంగ్వీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వైఖరిని విమర్శించారు. (ఇంత బీభత్సమా.. షాకయ్యాను)

బెంగాల్‌ ప్రజలు గడచిన గత ఐదు దశాబ్దాలుగా జాతీయ పార్టీలను కాదని, ప్రాంతీయ పార్టీలకు అధికారాన్ని అప్పగిస్తున్నందుకు కేంద్రం, తమ రాష్ట్రంపై కక్షగట్టిందా? అని సాంగ్వీ ప్రశ్నించారు. ఉంపన్‌ సృష్టించిన విధ్వంసం జాతీయ మీడియాకు కనిపించక పోవడం ఆశ్చర్యంగాను, బాధగానూ ఉందంటూ బెంగాల్, ఒడిశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు ఓ సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించారు. తుపాను సాయం కింద ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఏ మూలకు సరిపోతుందని వారు ప్రశ్నించారు. మామూలు ప్రభుత్వ ప్రాజెక్టులకే ఎక్కువ ఇస్తారని వారన్నారు. కేంద్రం మాట అటుంచితే కరోనా వార్తల ఒరవడిలో బెంగాల్‌ను కుదిపేసిన తుపాను వార్తలను జాతీయ మీడియా పట్టించుకోలేదేమో! (ఉంపన్‌.. కోల్‌కతా వణికెన్‌)

మరిన్ని వార్తలు