సుప్రీం ఆదేశాల్ని తుంగలో తొక్కిన బీజేపీ..!

11 Jan, 2020 14:25 IST|Sakshi

కోల్‌కత : పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మహిళలపై అఘాయిత్యాలు, శాంతి భద్రతల సమస్యపై స్థానిక బీజేపీ నేతలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా అత్యాచారానికి గురైన బాధితురాలి వివరాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. కుమార్‌గంజ్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల యువతి గత ఆదివారం అత్యాచారం, హత్యకు గురైంది. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ.. ఆమె వివరాలు బహిర్గతమయ్యేలా బీజేపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు.

బెంగాల్‌ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లాకెట్‌ ఛటర్జీ మాట్లాడుతూ.. ‘తొలుత మా నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. దాంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతితోనే నిరసన ర్యాలీ చేపట్టాం. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం’అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ కేసుకు సంబంధించి దేశమంతా కదిలిందని.. కానీ, బెంగాల్‌లో అలాంటి ఘటనే జరిగితే న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు నీతులు చెప్పే మమతా ప్రభుత్వం ఇక్కడ మాత్రం అధ్వానంగా పరిపాలిస్తోందని ఎద్దేవా చేశారు. అల్యాచారం, హత్యకు గురైన బాధితురాలి కుంటుంబాన్ని ప్రభుత్వం తరపున ఎవరూ కలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు బెనర్జీ, సంజయ్‌ సింగ్‌, దేవ్‌జిత్‌ సర్కార్‌ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు