ఒక్క ఆటోగ్రాఫ్‌.. మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ వెల్లువ

28 Jul, 2018 11:15 IST|Sakshi
రీటా మూడి- ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌

రాణిబంద్‌, పశ్చిమబెంగాల్‌ : ఇటీవల మిద్నాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభలో టెంట్‌ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో రీటా మూడి అనే 19 ఏళ్ల యువతి కూడా గాయాలపాలైంది. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు మోదీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో రీటా మూడి.. మోదీని ఆటోగ్రాఫ్‌ ఇవ్వాల్సిందిగా కోరింది. ‘దేవుడు నిన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాడు’.. మీరంతా త్వరగా కోలుకోవాలి అని ఆశిస్తూ మోదీ రీటాకు ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో.. చుట్టు పక్కల గ్రామాల్లో రీటా సెలబ్రిటీగా మారిపోయింది.

ఇక అప్పటి నుంచి రీటా, ఆమె కుటుంబంతో సెల్ఫీలు దిగేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఇప్పటికిప్పుడే రీటాను తమ ఇంటి కోడలిగా చేసుకుంటామంటూ పెళ్లి ప్రస్తావన కూడా తీసుకు వస్తున్నారు. రీటాతో పాటుగా.. ఆమె చెల్లి అనితకు కూడా పెళ్లి సంబంధాలు వెల్లువెత్తడంతో చదువు పూర్తైన తర్వాతే ఆ విషయం గురించి ఆలోచిస్తామంటూ సమాధానమిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు.


ఆస్పత్రిలో రీటాకు ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

మరిన్ని వార్తలు