పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

7 Jul, 2020 17:34 IST|Sakshi

కోల్‌కతా: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు పూర్తిగా లేక పాక్షిక లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఉత్తర 24 పరగణ జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. కరోనా కేసులు పెరుగుతుండటంతో మమత సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో  బీదన్నగర్, బరాసత్, బసిర్‌హాట్, బరాక్‌పూర్, బొంగావ్ మునిసిపల్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. ఇక్కడ మార్కెట్లు, ప్రభుత్వ రవాణాను పూర్తిగా మూసి వేస్తారు. కేవలం స్వంత దుకాణాలను మాత్రమే తెరిచేందుకు అనుమతించనున్నారు. (లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో పెరిగిన నిరుద్యోగం)

అన్‌లాక్‌ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కోవిడ్‌ కేసుల సంఖ్యగా భారీగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 7 లక్షల మార్క్‌ను దాటగా, మరణాల సంఖ్య 20 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 22,252 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,19,665కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కోవిడ్‌ బారిన పడినవారిలో గత 24 గంటల్లో 467 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 20,160కు చేరింది.  4,39,947 మంది కోవిడ్‌ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 61.13 శాతంగా నమోదయింది. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయి.(నేను ఒక్కదాన్నే ఉంటాను)

మరిన్ని వార్తలు