బెంగాల్‌లో మదర్సా టీచర్‌పై దారుణం

25 Jun, 2019 16:36 IST|Sakshi

కోల్‌కతా : గత ఏడాది మూక హత్యలు, గో రక్షకుల దాడులతో దేశం అట్టుడికిపోగా తాజాగా జై శ్రీరాం నినాదాల పేరిట హింసాకాండ కొనసాగుతోంది. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ ముఖ్యంగా ముస్లింల మీద దాడులు చేస్తున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ కొందరు వ్యక్తులు ఓ మదర్సా టీచర్‌పై దాడి చేసి రైలులోంచి తోసేశారు.

వివరాలు.. హఫీజ్‌ మహ్మద్‌ షారుక్‌ హల్దార్‌(26) మదర్సా టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న హఫీజ్‌ దగ్గరకు కొందర వ్యక్తులు వచ్చారు. అతనిపై దాడి చేస్తూ.. జై శ్రీరాం నినదాలు చేయాల్సిందిగా బలవంతం చేశారు. కానీ హఫీజ్‌ అందుకు ఒప్పకోలేదు. దాంతో అతడిని ట్రైన్‌ నుంచి బయటకు తోసేశారు. ప్లాట్‌ఫాం మీద పడిపోయిన హఫీజ్‌ను గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు.. ఈ దాడిలో హఫీజ్‌ చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డాడు. ఈ విషయం గురించి రైల్వే పోలీసు అధికారులు మాట్లాడుతూ.. హఫీజ్‌పై దాడి చేసిన వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. కానీ త్వరలోనే నిందితులను అరెస్ట్‌ చేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు