బెంగాల్‌ హింసపై కేంద్రం ఆందోళన 

10 Jun, 2019 08:02 IST|Sakshi

సందేశ్‌ఖలీ/న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణల అనంతరం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోంశాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బెంగాల్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించింది. ఆందోళనలు, అల్లర్లను నియంత్రించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బీజేపీ, టీఎంసీ నేతలు మాటలయుద్ధానికి దిగారు. టీఎంసీ శ్రేణుల దాడుల్లో బీజేపీ కార్యకర్తలు సుకాంత మొండల్, ప్రదీప్‌ మొండల్, శంకర్‌ మొండల్‌ చనిపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి సయతన్‌ బసూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదే ఘర్షణల్లో కయూమ్‌ మొల్లాహ్‌ అనే టీఎంసీ కార్యకర్త చనిపోయినట్లు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మృతదేహాలతో కోల్‌కతాలోని పార్టీ కార్యాలయానికి కమలనాథులు ఊరేగింపుగా తీసుకురాగా, పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ తన ప్రసంగాల ద్వారా రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బీజేపీ నేత ముకుల్‌రాయ్‌ ఆరోపించారు. తమ కార్యకర్తల చావుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 11 మంది మహిళలు సహా 62 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కేంద్రానికి జవాబు ఇచ్చింది. సంఘవిద్రోహక శక్తుల కారణంగా చెలరేగిన అల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు