మా భవిష్యత్తుకు ఏం హామీ ఇస్తారు?

7 Feb, 2020 08:46 IST|Sakshi
ఆందోళన చేస్తున్న విద్యార్థులు(ఫొటో కర్టసీ: ద న్యూస్‌ మినిట్‌)

సాక్షి, బెంగళూరు:  చిప్కో ఉద్యమం అందరికీ తెలిసే ఉంటుంది. జనాలు గుంపులుగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటూ చెట్లను ఆలింగనం చేసుకుని వాటిని నరకకుండా రక్షిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే గురువారం కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. బెంగళూరు శివారు ప్రాంతమైన సర్జపూర- అట్టిబెలె మార్గంలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేపట్టాలని ప్రణాళికలు రచించింది. అందుకోసం టెండర్లు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో కాంట్రాకర్లు ఆ ప్రాంతానికి రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న చెట్లను నరికేందుకు మార్కింగ్‌ చేసుకోగా సుమారు 1800 చెట్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, విద్యార్థులు గురువారం సాయంత్రం అంతా ఏకమై చెట్లను నరకడానికి వీల్లేదంటూ మానవహారం చేపట్టారు. ‘చెట్లను నరకవద్దు’ అంటూ నినాదాలిచ్చారు. ‘ఇప్పటికే రోడ్లు వెడల్పుగా ఉన్నందున ఈ పనులు అనవసరం. కాలుష్య కోరల్లో చిక్కుకున్న బెంగళూరు జీవించడానికి వీల్లేని నగరంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఉన్న కొన్ని చెట్లను కూడా నరికేసి మా భవిష్యత్తుకు ఏం హామీ ఇవ్వగలరు?’ అని ప్రశ్నించారు. (నిరసనలతో అరాచకం)


చెట్లు.. బాహ్య ఊపిరితిత్తులు
రోడ్డు వెడల్పు.. పర్యావరణాన్ని నాశనం చేస్తుందే తప్ప ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించదని నిరసనకారులు పేర్కొన్నారు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు. సబర్బన్‌ రైళ్లు నడుపడం, బస్‌ సర్వీసులు పెంచడం ద్వారా ప్రజలకు కార్లు వాడాల్సిన పని తప్పుందన్నారు. బెంగళూరు ఇప్పటికే డేంజర్‌ జోన్‌లో ఉందని, కనుక మరిన్ని చెట్లను కోల్పోవడం ఎంతమాత్రం సహించబోమని  స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలతో వాతావారణాన్ని క్షీణింపజేయడమే కాక మన ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జపుర గ్రామవాసి దీపాంజలి నాయక్‌ మాట్లాడుతూ..చెట్లు లేకుండా బతకలేం.. అవి మనకు బాహ్య ఊపిరితిత్తులు. 100యేళ్ల పైబడి వయస్సున్న చెట్లను నరకివేయడం మాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. పైగా ఇలాంటి చెట్లను మళ్లీ నాటడం ఎంతో కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాంట్రాకర్లు మాత్రం వాళ్లు అవేవీ పట్టించుకోకుండా నిరసన చేస్తున్న సమయంలోనే రహదారి సర్వే చేయడం గమనార్హం. (గుడ్రంగా తిరుగుతున్న మొక్క)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా