నిరసన జ్వాలలు: డీసీపీపై ప్రశంసలు!

20 Dec, 2019 08:25 IST|Sakshi

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటకలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బెంగళూరు, మంగళూరులో ఆందోళనకారులు పలుచోట్ల టైర్లు మండిస్తూ నిరసనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 144 సెక్షన్‌ విధించినప్పటికీ రోడ్లపైకి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. కాగా బెంగళూరు టౌన్‌హాల్‌ వద్దకు చేరుకున్న నిరసనకారులను.. అక్కడి నుంచి పంపించేందుకు బెంగళూరు సెంట్రల్‌ డీసీపీ చేతన్‌ సింగ్‌ రాథోడ్‌ చేసిన ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. శాంతియుత నిరసనలో అరాచక, అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే పరిస్థితి చేజారుతుందంటూ తొలుత ఆయన మైకులో హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో.. ఆయన జాతీయ గీతం ఆలపించడం మొదలుపెట్టారు. దీంతో ఆయనతో పాటు గొంతు కలిపిన నిరసనకారులు.. ఒక్కొక్కరుగా ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.(దేశవ్యాప్తంగా ఆందోళనలు.. అరెస్ట్‌లు)

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో డీసీపీ చేతన్‌ సింగ్‌ రాథోడ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘దేశంలోని చాలా చోట్ల.. ముఖ్యంగా ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును మనం చూశాం. మరికొన్ని చోట్ల నిరసనకారులపై విరుచుకుపడ్డ పోలీసులను కూడా చూశాం. అయితే మీరు ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఎవరికీ హాని కలగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మీకు సెల్యూట్‌ సార్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు