చిన్నమ్మ కోసం జైలు రూల్స్ బ్రేక్

5 Apr, 2017 18:09 IST|Sakshi
చిన్నమ్మ కోసం జైలు రూల్స్ బ్రేక్
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మ శశికళ కోసం జైలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారట. బెంగళూరు సెంట్రల్ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా రోజుకు ఒక్క విజిటర్ నైనా ఆమె కలవడానికి అనుమతిస్తున్నారని వెల్లడైంది. 31 రోజుల్లో 27 మంది విజిటర్లు ఆమెను కలవడానికి వచ్చినట్టు తెలిసింది. రోజుకు ఓ విజిటర్ అయినా ఆమె దగ్గరకు రావడం బెంగళూరు జైలు మాన్యువల్ ప్రకారం కఠోర ఉల్లంఘన. కానీ ఆ రూల్స్ ను బెంగళూరు జైలు ఉల్లంఘిస్తోంది. మరోవైపు సాధారణ ఖైదీల్లా కాకుండా... శశికళ టీమ్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు ఇండియా టుడే తెలిపింది. జైలు మాన్యువల్ ప్రకారం.. ఖైదీలను చూడటానికి విజిటర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే రావాలి.
 
కొన్ని సందర్భాల్లో శశికళను, ఆమెతో పాటు శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరు ఇల్లవరసి, సుధాకరన్ లను చూడటానికి వచ్చే విజిటర్లు సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వస్తున్నారని తెలిసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖులు వారానికోసారి లేదా 15 రోజుల్లో ఓసారి మాత్రమే ఇంటర్వ్యూ ఇ‍వ్వడానికి మాత్రమే అర్హులై ఉంటారు. ఇప్పటివరకు శశికళను, ఇల్లవరసిని కలవడానికి వచ్చిన విజిటర్ల జాబితాను ఇండియా టుడే రాబట్టింది. ఆ జాబితా ప్రకారం 2017 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 18 వరకు చెన్నైకు చెందిన అడ్వకేట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జైలుకు వచ్చి శశికళను కలిసినట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇల్లవరసి, సుధాకరన్ లు ప్రస్తుతం బెంగళూరులోని పరపణ్ణ అగ్రహార జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 
 
మరిన్ని వార్తలు