‘బెంగళూరు’ నగరానికి ఏమైందీ?

18 Sep, 2018 18:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు ఎటు చూసినా పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో అలరించిన బెంగళూరు నగరం 21వ శతాబ్దంలో బోసి పోయింది. ఒకప్పుడు గార్డెన్‌ సిటీగా పేరుపొందిన నగరం ఇప్పుడు కాంక్రీట్‌ జంగిల్‌గా పేరు మార్చుకుంటోంది. 17వ శతాబ్దంలో కూరగాయల పంటలతో పచ్చగా కనిపించిన నగరంలో 18వ శతాబ్దంలో ఆనాటి పాలకులు హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌లు మొదటిసారిగా ల్యాండ్‌ స్కేప్‌ గార్డెన్లను డిజైన్‌ చేశారు. 1799లో బ్రిటీష్‌ పాలకులు టిప్పు సుల్తాన్‌ను ఓడించి బెంగళూరు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాక నగరంలోని అతి ప్రాచీన ‘లాల్‌ బాగ్‌’ పార్క్‌లో ఫలపుష్పాల పెంపకాన్ని ప్రోత్సహించారు. అందుకోసం వారు ప్రతి ఏటా భారీ ఎత్తున పూల ప్రదర్శన పోటీలను కూడా నిర్వహించేవారు.

నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పార్కులను అభివృద్ధి చేసిన బ్రిటీష్‌ పాలకులు, ఓరాంగుటాన్, నల్ల పులుల లాంటి జంతువులను విదేశాల నుంచి తీసుకొచ్చి జంతు సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నాడు బ్రిటీష్‌ పర్యాటనకులను కూడా విశేషంగా ఆకర్షించిన బెంగళూరు నగరం అనతికాలంలోనే ఇతర దేశాల పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించింది. ఫలితంగా భిన్న సంస్కృతల సమ్మిళిత నిలయంగా నగరం కనిపిచ్చేది. 1970వ దశకంలో, 1990వ దశకంలో నగరంలో పార్కులను దేశ పాలకులు బాగా అభివృద్ధి చేశారు.

1973లో నగరంలో 68.27 శాతం చెట్లు ఉండగా, 2013 నాటికి అవి 15 శాతానికి చేరుకున్నాయని, అంటే ప్రతి ఏడుగురు పౌరులకు ఒక్క చెట్టు చొప్పున మిగిలిందని ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’కు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. నేడు నగరంలో 1200 పార్కులు ఉన్నట్లు ‘బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక’ ఘనంగా చెప్పుకుంటోంది. కానీ ఆ పార్కుల మొత్తం విస్తీర్ణం కలిపి రెండు చదరపు కిలోమీటర్లు మాత్రమే. మొత్తం బెంగళూరు నగరం విస్తీర్ణం 2,196 చదరపు కిలోమీటర్లు. అంటే నగర విస్తీర్ణంలో పార్కుల శాతం 0.1 శాతం మాత్రమే.

ప్రస్తుతం ఆ పార్కులు కూడా వాకర్లకు తప్పించి మరెవరికీ ఉపయోగపడడం లేదు. ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది లేదా పది గంటల వరకు, మళ్లీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకే తెరిచి ఉంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా వాకర్లే పార్కుల్లో తిరుగుతుంటారు. ఏ మూలో బాగుందగదా అని కాసేపు కూర్చుంటే విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. అవి ఏ పిట్టల అరుపులో అనుకుంటే పొరపాటే. పార్కు సెక్యూరిటీ గార్డుల విజిల్స్‌. పార్క్‌ నుంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరికలు. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పార్కులను సంఘవిద్రోహ శక్తులు, మందుబాబులు, పడుపుకత్తెల బెడద పేరుతో మూసేస్తున్నారు. ఈ మాత్రపు పచ్చదనాన్ని అనుభవించే భాగ్యం ప్రవేశ రుసుంల కారణంగా పేదలకు, కార్మికులకు అందుబాటులో లేకుండా పోతోంది.

(నగరంలోని ఆజిమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ హరిణి నాగేంద్ర తన నగరానికి ఏమైందన్న ఆందోళనతో రాసిన ‘నేచర్‌ ఇన్‌ ది సిటీ’లో అంశాలివి)

మరిన్ని వార్తలు