ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సిద్దరామయ్య

14 Sep, 2016 13:27 IST|Sakshi
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సిద్దరామయ్య

బెంగళూరు: కావేరీ జలాల వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య భేటీకానున్నారు. మరోపక్క, కావేరీ జలాలపై వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరారు. దీనిపై ఇప్పటి వరకు పీఎంవో స్పందించలేదు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వస్తే సిద్ధరామయ్య వెళ్లనున్నారు. సెప్టెంబర్ 9నే ప్రధానికి లేఖ రాశామని, అయినా వారు జోక్యం చేసుకోలేదని కర్ణాటక అధికారి ఒకరు చెప్పారు. అల్లర్లకు ముందు కూడా పరిస్థితి సున్నితంగా ఉందని కూడా చెప్పామన్నారు.

కావేరి జలాల విషయంలో తక్షణం పరిష్కారం చూపాలని కోరినట్లు వివరించారు. కాగా, కావేరి జలాల వివాదం విషయంలో ఎట్టకేలకు బెంగళూరులో పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి. చాలా చోట్లు కర్ఫ్యూను సడలించారు. బెంగళూరులో దాదాపుగా అన్ని కార్యాలయాలు, కంపెనీలు తెరుచుకున్నాయి. రవాణా వ్యవస్థలన్నీ తిరిగి ప్రారంభమైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పరిస్థితి సున్నితంగా ఉండటంతో సెక్యూరిటీని కొనసాగిస్తున్నామని చె్పారు. అల్లర్లలో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా లాఠీఛార్జీ భయంతో భవనంపై నుంచి దూకి మరొకరు చనిపోయారు.

>
మరిన్ని వార్తలు