బీజేపీ సత్తా వెనక రాంమాధవ్

26 Dec, 2014 01:01 IST|Sakshi
బీజేపీ సత్తా వెనక రాంమాధవ్
  • జమ్మూకశ్మీర్‌లో కమలం 25 సీట్లు గెలవడంలో కీలకం
  • అత్యధిక ఓట్ల శాతం వెనక తెలుగుతేజం కృషి
  • సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం వెనక తెలుగుతేజం, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యూహం పనిచేసిందని జాతీయ మీడియా పేర్కొంటోంది. ముఖ్యంగా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి తమ బలాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ పెంచుకుంటూ 25 సీట్లు గెలుపొందడంలో, అత్యధిక ఓట్ల శాతం (23%) సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారని చెబుతోంది. 67 శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ర్టంలో బీజేపీ రెండో స్థానంలో నిలవడం ఆషామాషీ విషయం కాదని...పక్కా ప్రణాళికతో పనిచేయడం వల్లే కమలదళం ఈ ఫలితాలు సాధించగలిగిందని అంటోంది. ఇంతకీ రాంమాధవ్ రాష్ట్రంలో అనుసరించిన వ్యూహం ఏమిటంటే...
     
    అభివృద్ధి నినాదంతో ముందుకు...

    జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే వివాదాస్పద ‘ఆర్టికల్ 370’ని నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా ఎంచుకోగా రాంమాధవ్ వ్యూహంతో బీజేపీ మాత్రం అభివృద్ధి నినాదాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకొని ప్రజల వద్దకు వెళ్లింది. అభివృద్ధి చుట్టూ ప్రచారం చేపట్టేలా పార్టీ శ్రేణులను రాంమాధవ్ సమాయత్తం చేశారు. ఉగ్రవాదం, హింస కారణంగా అభివృద్ధిలో వెనకబడిన రాష్ట్రం అన్ని రంగాల్లో పుంజుకునేలా చేయడం కేవలం బీజేపీకే సాధ్యమంటూ ప్రచారంలో ఆయన నినదించారు.

    ‘కుటుంబ పాలన, అవినీతితో మమేకమైన పార్టీలు కావాలా? అభివృద్ధి కావాలా?’ అని ప్రజలను ప్రశ్నించారు. కశ్మీర్‌లో ఎన్నికలను, రాజకీయాలను పాకిస్తాన్ అంశంతోనే ముడిపెడుతున్నారని, దశాబ్దాలుగా అదే ఎజెండా అయ్యిందని, దాన్ని పక్కనబెట్టి అభివృద్ధి దిశగా నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్ అంశం యావత్ భారత దేశంతో ముడివడి ఉందని, కేవలం ఆ రాష్ట్రంతోనే సంబంధం కలిగి లేదని ఎన్నికలకు ముందు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
     
    మాజీ వేర్పాటువాదులతో మంతనాలు...
     
    కశ్మీర్ లోయలో బలంగా లేమని గ్రహించిన ఆయన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్‌లతో విసిగి వేసారిన నేతలతో సంబంధాలు నెరిపి కొత్త సమీకరణలకు తెరతీశారు. గతంలో వేర్పాటువాదాన్ని బలంగా వినిపించిన నేతలతోనూ సంబంధాలు నెరిపారు. మాజీ వేర్పాటువాది, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు సజ్జాద్ గనీ లోన్ ప్రధాని మోదీని కలవడం వెనక కూడా రాంమాధవ్ ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
     
    కశ్మీరీ పండితుల కోసం...

    కశ్మీరీ పండితులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు రాంమాధవ్ వ్యూహాలు రచించారు. వీరంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కశ్మీరీ పండిట్ సంఘాలన్నీ కృషిచేశాయి. ఈ సంఘాల్లో ప్రేరణ కల్పించింది బీజేపీ వ్యూహమే. కాగా, కశ్మీర్‌లో వరదలను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమైందీ? కేంద్రం ఎలా సాయపడిందీ వివరించడంలోనూ బీజేపీ విజయం సాధించింది.
     
    మెరుగైన ఫలితం...

    రాంమాధవ్ ప్రచార వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ జమ్మూకశ్మీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 25 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. 1987లో రెండు సీట్లతో రాష్ర్టంలో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం 1996లో 8 సీట్లు, 2002లో 11 సీట్లకు చేరి తాజాగా గత ఎన్నికలకన్నా రెట్టింపు సీట్లను సాధించే స్థాయికి ఎదిగింది. అయితే బీజేపీ గెలుచుకున్న సీట్లన్నీ జమ్మూ ప్రాంతం నుంచే కావడం, కశ్మీర్ లోయ, లడఖ్‌లలో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం ఒక్కటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలాంశంగా నిలిచింది. ఎన్నికల ఫలితంపై రాంమాధవ్‌ను మీడియా ప్రశ్నించగా ‘ఎన్నికల ఫలితం మిశ్రమ భావాలను మిగిల్చింది. అయితే పార్టీకి ఇదొక గొప్ప విజయం. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా నిలిచాం. రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
     

మరిన్ని వార్తలు