బ్రిటీషువాడి గుండెను చీల్చిన ఆ తుపాకీ దొరికింది

16 Feb, 2017 11:52 IST|Sakshi
బ్రిటీషువాడి గుండెను చీల్చిన ఆ తుపాకీ దొరికింది

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు బ్రిటీషువాడి గుండెల్లోకి బుల్లెట్‌ దించి ఉరికొయ్యను ముద్దాడిన భారతమాత ముద్దుబిడ్డ భగత్‌ సింగ్‌ ఉపయోగించిన తుపాకీ దొరికింది. దీనితోనే బ్రిటన్‌ అధికారి జాన్‌ శాండర్స్‌ను ఆయన చంపేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరిగే రోజుల్లో నూనూగు మీసాల వయసులోనే భగత్‌సింగ్‌ తెల్లవాళ్లకు ఎదురు తిరిగారు. 1928 డిసెంబర్‌ 17న బ్రిటీష్‌ అధికారి జాన్‌ శాండర్స్‌ను సీరియల్‌ నెంబర్‌ 168896 కలిగిన 32ఎంఎం కోల్ట్‌ ఆటోమేటిక్‌ పిస్టల్‌తోకాల్చి చంపేశాడు.

ఈ సంఘటన బ్రిటీష్‌ వారిని ఉలిక్కిపడేలా చేసింది. దీని అనంతరం భగత్‌ సింగ్‌ను పట్టుకొని బంధించి 1931 మార్చి 23న ఉరి తీశారు. వాస్తవానికి ఈ తుపాకీని బీఎస్‌ఎఫ్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ విపన్స్‌, టాక్టిక్స్‌(సీడబ్ల్యూఎస్‌టీ) ప్రదర్శనకు ఉంచారు. అయితే, భగత్‌ సింగ్‌దే ఆ తుపాకీ అని ఎవరికీ తెలియదు. ఇది తొలిసారి బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఇండోర్‌ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అయితే, అంతకుముందు దీనిపై ఉన్న నలుపురంగును తొలగించి శుభ్రం చేసే క్రమంలో దానిపై ఉన్న సీరియల్‌ నెంబర్‌ ఆధారంగా ఈ తుపాకీ భగత్‌సింగ్‌దే అనే విషయం తెలిసింది.

మరిన్ని వార్తలు