పెట్రో సెగ.. కొనసాగుతున్న భారత్‌ బంద్‌

10 Sep, 2018 09:38 IST|Sakshi
ఢిల్లీలో బంద్‌లో పాల్గొన్న రాహుల్‌ గాంధీ

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసిస్తూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ఇతర నేతలు పెట్రెల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ నుంచి రామ్‌లీలా మైదానం వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ...

విజయవాడ : పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. ధరలను నిరసిస్తూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేపట్టాయి. అక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

కరీంనగర్ : పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు బస్టాండ్ వద్ద బైఠాయించారు. బస్టాండ్‌ నుంచి బస్సులను బయటకు రానివ్వకుండా వారు అడ్డుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్, డీసీపీ అధ్యక్షులు మృత్యుంజయంతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆందోళన కారులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు.  

నల్గొండ :  పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్‌లో వామపక్షాలు పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా నల్గొండ బస్ డిపోలో వామపక్షాల నాయకులు బైఠాయించారు.  బైఠాయింపుతో రాకపోకలు నిలిచిపోయి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

చిత్తూరు : జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారత్ బంద్ సందర్భంగా సీపీఐ,సీపీఎమ్‌, జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బంద్‌ కారణంగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పెట్రోల్ డీజల్ ధరల పెంపును నిరసిస్తూ మదనపల్లిలో వామపక్షాలు, జనసేన ,కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. బంద్‌కు మద్దతుగా పలు ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి.  

గుంటూరు : పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బంద్ చేపట్టాయి. గుంటూరు, వినుకొండ, నరసరావుపేట, రేపల్లె, సత్తెనపల్లి బస్టాండ్ వద్ద ఆందోళనకారులు బైఠాయించారు. వారు ఆర్టీసీ బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కృష్ణాజిల్లా : పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త బంద్ కొనసాగుతోంది. తిరువూరులో బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు బస్సులను తిప్పుతున్నారు.  

కర్నూల్ : పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరలను వ్యతిరేకిస్తూ డోన్‌లో సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో తెల్లవారు జామున 4 గంటలకే బంద్ ప్రభావం మొదలైంది. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన ఆందోళనకారులు బస్సులు బైటికి రాకుండా అడ్డుకున్నారు. కర్నూలు నగరంలో సైతం పెంచిన పెట్రో ధరలకు నిరసనగా ఆర్టీసీ బస్‌స్టాండ్‌ వద్ద  వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిపో వద్ద బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.  

ప్రకాశం : జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు పెంపునకు నిరసనగా భారత్ బంద్‌ కొనసాగుతోంది. బంద్‌లో భాగంగా ఒంగోలు ఆర్టీ బస్టాండ్ ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీల కార్యకర్తలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.

మేడ్చల్ : పెట్రోల్,డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కుత్బుల్లాపూర్ జీడిమెట్ల బస్ డీపో వద్ద బైఠాయించారు. డిపో నుంచి బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ బంద్‌లో కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.

వైఎస్సార్ :  జిల్లాలో పెంచిన పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలతో పాటు పలు పార్టీలు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి. కడప ఆర్టీసీ బస్టాండ్ గేట్ వద్ద వామపక్షాల నేతలు భైఠాయించారు. బంద్‌లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల : పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. బంద్‌లో భాగంగా వేములవాడ ఆర్టీసీ డిపో ముందు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.

విజయనగరం : పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బంద్‌ చేపట్టింది. బంద్‌లో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆర్టీసీ  బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి.

భద్రాద్రి  కొత్తగూడెం : పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలకు నిరసనగా చేపట్టిన భారత్‌ బంద్‌లో అఖిలపక్షం పాల్గొంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో  ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా కొత్తగూడెం ఆర్.టి.సి. డిపో ఎదుట వారు ధర్నా చేపట్టారు.

పశ్చిమ గోదావరి : పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలను నిరసిస్తూ వామపక్షాలు, జనసేన పార్టీల ఆధ్వర్యంలో  బంద్‌ కొనసాగుతోంది. ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద తెల్లవారుజాము నుంచి బంద్‌ మొదలైంది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిరసన తెలుపుతున్న ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. నర్సాపురంలో పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, జనసేన నాయకులు, కార్యకర్తలు నర్సాపురం ఆర్టీసీ డిపోను ముట్టడించారు.

 దీంతో పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బంద్‌కు మద్దతుగా ప్రైవేటు విద్యా సంస్ధలు సైతం సెలవు ప్రకటించాయి. జంగారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద తెల్లవారుజాము నుంచి బంద్‌ మొదలైంది.  పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. అనంతరం బస్సులు యధావిధిగా తిరుగుతున్నాయి.

మహబూబ్ నగర్ : జిల్లాలోని నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు తేల్లావారు జామున 5 గంటల నుంచి అఖిలపక్ష నాయకులు  బస్ డిపో ముందు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎమ్‌ఎల్‌, పీడీఎస్‌యూ, పీవైఎల్‌, వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. భారత్ బంద్  సందర్భంగా పెట్రోల్ ధరలను నిరసిస్తూ వామపక్షాలు  తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భైఠాయించాయి.  

శ్రీకాకుళం : పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపునకు  నిరసనగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద వామపక్షాల కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. బస్సులు ఎక్కడికి కదలలేక డిపోలకే పరిమితమయ్యాయి.  దీంతో వామపక్షాల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషనుకు తరలించారు.

వరంగల్ రూరల్ : నర్సంపేట పట్టణంలో డీజల్, పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ  కాంగ్రెస్, వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో  ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డిపో ముందు బైఠాయించి బైక్ ర్యాలీలు, నిరసనలు తెలియజేశారు. మహబూబాబాద్‌లో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా తొర్రూర్‌లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ చేపట్టారు.

నెల్లూరు : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాలు, కాంగ్రెస్‌ నేతలు బంద్‌ను చేపట్టారు. వారు నెల్లూరు ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు.దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జగిత్యాల : పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ చేపట్టిన బంద్‌లో భాగంగా జగిత్యాలలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ఎడ్ల బండిలో పర్యటిస్తూ బంద్‌ను పర్యవేక్షించారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

నిర్మల్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిర్వహించిన బంద్ విజయవంతమైంది. అఖిలపక్షాల బంద్‌కు వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, స్వచ్చందంగా సహకరించారు. ప్రైవేట్ పాఠశాలలను మూసి నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మంచిర్యాల : లకిశెట్టిపేట పట్టణంలో డీజల్, పెట్రోల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ  కాంగ్రెస్ ,వామపక్షాలు బంద్‌ చేపట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్, వ్యాపార సంఘలు సైతం బంద్ పాటించాయి.

ఆదిలాబాద్ : ఉట్నూర్‌లో భారత్ బంద్ సందర్భంగా ఉట్నూర్ బస్ డిపో వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. బంద్‌ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆందోళనకారులను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఉట్నూర్  పోలీస్ స్టేషన్ తరలించారు.

మరిన్ని వార్తలు