ఆదాయం 1027.. ఖర్చు 758

19 Dec, 2018 03:48 IST|Sakshi

2017–18 ఆర్థికంలో బీజేపీఆదాయ వ్యయ వివరాలు(కోట్లలో) 

ఈసీకి ఇంకా వివరాలు అందజేయని కాంగ్రెస్‌ 

2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను భారతీయ జనతాపార్టీ ఆదాయం రూ.1,027.34 కోట్లు కాగా రూ.758.47 కోట్లు (74%) ఖర్చు చేసిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) తెలిపింది. వివిధ పార్టీలు ఎన్నికల కమిషన్‌కు అందజేసిన ఆదాయ వ్యయవివరాలను ఏడీఆర్‌ మంగళవారం వెల్లడించింది. అక్టోబర్‌ 30వ తేదీలోగా ఎన్నికల కమిషన్‌కు ఆదాయ వివరాలను నివేదించాల్సి ఉండగా బీజేపీ కాలపరిమితి దాటిన 24 రోజుల తరువాత ఇవ్వగా, కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు వెల్లడించిన దాఖలాల్లేవని ఏడీఆర్‌ తెలిపింది. అదేవిధంగా, జాతీయపార్టీల్లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ‘బీఎస్‌పీ) మొత్తం ఆదాయం రూ.51.7 కోట్లు కాగా ఖర్చు రూ.14.78 కోట్లు(29%) మాత్రమే.

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఎన్‌సీపీ ఆదాయం రూ.8.15 కోట్లయితే రూ.8.84 కోట్లు ఖర్చు చేసింది. 2017–18లో ఆరు జాతీయ పార్టీలకు కలిపి ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో అందిన స్వచ్ఛంద విరాళాలు రూ.1,041.80 కోట్లు రాగా ఇందులో బీజేపీ వాటా రూ.210కోట్లు. మొత్తం పార్టీలన్నిటికీ వచ్చిన ఆదాయంలో ఆరు పార్టీల విరాళాలే 86.91 శాతంగా ఉన్నాయి. ఆ ఆరు పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ. కాగా, టీఎంసీ, సీపీఎం, బీఎస్‌పీలు నిర్ణీత కాలంలోనే అక్టోబర్‌ 30 కల్లా ఆదాయ వివరాలను వెల్లడించాయి. సీపీఐ గడువు ముగిసిన ఒక రోజు తర్వాత,  20 రోజుల అనంతరం ఎన్‌సీపీ, 24 రోజుల తర్వాత బీజేపీ సమర్పించాయి.

గడువు ముగిసిన 48 రోజుల తర్వాత, డిసెంబర్‌ 17నాటికి కూడా కాంగ్రెస్‌ ఆడిట్‌ నివేదిక ఎన్నికల కమిషన్‌కి అందించలేదని ఏడీఆర్‌ వెల్లడించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం– 1951 ప్రకారం రాష్ట్ర శాసనసభలో కానీ, ప్రజాప్రతినిధుల సభలో గానీ గత సాధారణ ఎన్నికల్లో ఒక శాతం కన్నా తగ్గకుండా ఓట్లు సాధించిన పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్లు స్వీకరిచేందుకు అర్హులవుతాయి. ఈ పార్టీలు ఎలక్టోరల్‌ బాండ్లను బ్యాంకుల ద్వారా డబ్బు రూపంలోకి మార్చుకోవచ్చు. ‘రాజకీయ పార్టీలకు కమీషన్లను ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఇస్తున్నారు. అందుకే ఎక్కడా పెద్దమొత్తంలో డబ్బు లావాదేవీలు జరిగినట్లు తెలియదు’ అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అందుకే రఫేల్‌ డీల్‌లో డబ్బులు ఎక్కడ చేతులు మారాయంటూ బీజేపీ పదేపదే ప్రశ్నిస్తోందని ఏచూరి అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనం కోసమే సన్నిహితులైన కార్పొరేట్‌ మిత్రుల ద్వారా నిధులను స్వీకరిస్తోందని ఏచూరి ఆరోపించారు.   

మరిన్ని వార్తలు