ఆజాద్‌ను తిరిగి ఢిల్లీ పంపించిన హైదరాబాద్‌ పోలీసులు

27 Jan, 2020 09:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను హైదరాబాద్‌ పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఉదయం 6.55 నిమిషాలకు ఆయన్ను తిరిగి ఢిల్లీకి పంపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో  టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్( టీఐఎస్‌ఎస్‌) విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆజాద్‌ను ఆదివారం హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెహిదిపట్నంలోని క్రిస్టల్‌ గార్డెన్‌లో జరిగే సమావేశంలో ఆజాద్‌ పాల్గొని అక్కడ ప్రసంగించాల్సి ఉంది. అయితే నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి లేనందున మార్గ మాధ్యలోనే ఆయన్ను అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. (చంద్రశేఖర్ ఆజాద్‌కు బెయిల్‌ సవరణ)

సోమవారం తనను బలవంతంగా ఢిల్లీకి తీసుకెళ్తున్నారని ఆజాద్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అలాగే ’తెలంగాణలో నియంతృత్వం తారాస్థాయికి చేరింది. ప్రజల నిరసన హక్కులను కొల్లగొడుతున్నారు. తొలుత మా అనుచరులపై లాఠీ చార్జ్‌ జరిపారు. తరువాత నన్ను అరెస్టు చేశారు.  ప్రస్తుతం  విమానాశ్రయానికి తీసుకువచ్చి ఢిల్లీకి పంపుతున్నారు. బహుజన్ సమాజం ఈ అవమానాన్ని ఎప్పటికీ మరచిపోదు. త్వరలో తిరిగి వస్తాం’ అని ట్వీట్‌ చేశారు. కాగా, జామా మసీదు వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినందుకు గాను ఆజాద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత  జనవరి 16న ఆజాద్ తీహార్ జైలు నుంచి బయటకొచ్చి.. మరోసారి జామా మసీదుకు వెళ్లి అక్కడ రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. తాను కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని.. జామా మసీదుకు రావడానికి ముందు గురుద్వారా, దేవాలయాలను సందర్శించినట్లు ఆ సందర్భంగా ఆజాద్ తెలిపారు.

చదవండి: జామా మ‌సీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్

మరిన్ని వార్తలు