‘మోదీపై పోటీని విరమించుకుంటున్నా’

17 Apr, 2019 19:39 IST|Sakshi

లక్నో : వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసే విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చం‍ద్రశేఖర్‌ ఆజాద్‌ తెలిపారు. తాను,  అనుచర వర్గమంతా ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘ వారణాసి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా కారణంగా నరేంద్ర మోదీకి ఎటువంటి లాభం చేకూరకూడదని భావించాను. మేమంతా బీజేపీ ఓటమి కోసం కృషి చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికల్లో మోదీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అదే నియోజక వర్గం నుంచే తాను బరిలో ఉంటానని ఆజాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో దళితుల ఓట్లు చీల్చి బీజేపీకీ లాభం చేకూర్చడానికే ఆజాద్‌ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.

ఈ నేపథ్యంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆజాద్‌.. మాయావతి ఎన్నటికీ దళితుల శ్రేయోభిలాసి కాలేరని.. కేవలం భీమ్‌ఆర్మీ మాత్రమే వారికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. అదే విధంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా తన అనునాయులకు ప్రమోషన్‌ ఇవ్వడం కోసం దళితులపై ఎన్నో అకృత్యాలకు ఒడిగట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తులు తనను బీజేపీ ఏజెంట్‌ అనడం విడ్డూరంగా ఉందని... దళితులకు ఓటు వేయడమే కాకుండా ప్రభుత్వాన్ని కూల్చడం కూడా తెలుసునని హెచ్చరించారు.

కాగా వారం రోజులు కూడా తిరగకముందే ఆజాద్‌ తన స్టాండ్‌ మార్చుకోవడం విశేషం. మాయావతిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బ్రాహ్మణ నాయకుడు సతీష్‌ చంద్ర మిశ్రాను విమర్శించిన ఆజాద్‌... మోదీపై ఆయనను పోటీకి నిలబెడితే ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతునిస్తానంటూ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాకుండా తనపై మాయావతి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి.. ‘ మా వాళ్లే నన్ను బీజేపీ ఏజెంట్‌ అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాయావతి ప్రధాన మంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కారణంగా ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం చేకూరకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసే అభ్యర్థిని ఎస్పీ-బీఎస్పీ కూటమి ఇంతవరకు ఖరారు చేయలేదు. 

చదవండి : మోదీపై కచ్చితంగా పోటీ చేస్తా : ఆజాద్‌

మరిన్ని వార్తలు