భీమ్‌ ఆర్మీ చీఫ్‌ ఆరోగ్యంపై ఆందోళన..

5 Jan, 2020 16:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌర చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని అరెస్టై జైలులో ఉన్న భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆరోగ్యం బాగాలేదని, తక్షణమే వైద్యసాయం అందించకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆజాద్‌కు ప్రతి రెండు వారాలకు ఒకసారి అదనపు ఎర్ర రక్త కణాలను రక్తం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు హర్జీత్‌ సింగ్‌ భట్టీ చెప్పారు.గత వారం కిందటే ఆయనకు వైద్య చికిత్స అందించాల్సి ఉందని, ప్రస్తుతం ఆజాద్‌ తలనొప్పి, కడుపునొప్పితో బాధిపడుతున్నారని డాక్టర్‌ భట్టి తెలిపారు. సత్వరమే ఆయనకు చికిత్స అందించకుంటే అతడి రక్తం మందమై గుండె పోటుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఆయనను ఎయిమ్స్‌కు తరలించేందుకు అనుమతించడలేదని అన్నారు. కాగా గత ఏడాదిన్నరగా ఈ వ్యాధికి ఆజాద్‌ వైద్యచికిత్స తీసుకుంటున్నారని, అదే విషయం ప్రస్తుతం ఆయన ఉంటున్న తీహార్‌ జైలు అధికారులకు తెలిపామని భీమ్‌ ఆర్మీ ప్రతినిధి కుష్‌ అంబేడ్కర్‌వాది తెలిపారు. మరోవైపు ఆజాద్‌ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనను పరిశీలించిన జైలు వైద్యుడు నిర్ధారించారని జైలు అధికారులు పేర్కొనడం గమనార్హం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు