పిల్లల ముఖాలపై స్టాంపులు

9 Aug, 2017 10:46 IST|Sakshi
పిల్లల ముఖాలపై స్టాంపులు
  • భోపాల్‌ సెంట్రల్‌ జైలు సిబ్బంది నిర్వాకం
  • వివరణ కోరిన హెచ్చార్సీ

  • భోపాల్‌: మధ్యప్రదేశ్‌ జైలు అధికారులు చేసిన నిర్వాకంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. జైల్లో ఉన్న తమ తం‍‍డ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు మైనర్ల ముఖాలపై విజిటింగ్‌ స్టాంపులేశారు. ఆ ఫోటోలు సోషల్‌మీడియా, ప్రముఖ పత్రికల్లో రావడం, పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగిపోయాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర మానవహక్కుల సంఘం.. జైలు అధికారులను ఘటనపై వివరణ కోరింది. ఇది ముమ్మాటికీ మానవ, బాలల హక్కుల ఉల్లంఘనే అవుతుందని హెచ్చార్సీ అభిప్రాయపడింది.

    అయితే జైలు అధికారులు మాత్రం అది అనుకోకుండా జరిగి ఉండొవచ్చని భావిస్తున్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా ఆ ఇద్దరు పిల్లలు జైల్లో ఉన్న తమ తండ్రిని చూడటానికి వచ్చారు. ఆ రోజు సుమారు 8,500 మంది జైలులో ఉన్న తమ బంధువులను సందర్శించారు. అందులో ఎక్కువగా పిల్లలు, మహిళలే ఉన్నారని జైలు సూపరిండెంట్‌​ దినేశ్‌ నర్గేవ్‌ తెలిపారు. సాధారణంగా అయితే అలా వచ్చిన సందర్శకుల చేతిపై స్టాంపు వేస్తారు. కానీ, ఈ ఇద్దరు చిన్నారుల ముఖంపై మాత్రం స్టాంప్‌​ వేయటం ఇక్కడ విడ్డూరం. ఈ ఘటన ఎందుకు జరిగిందో విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. కావాలని చేసిన పనే అయితే కఠిన చర్యలు ఉంటాయని దినేశ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు