హెల్మెట్‌ పెట్టుకోలేదా.. ఈ పోటీలో పాల్గొనండి!

17 Jan, 2020 11:37 IST|Sakshi

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించడంలో తమ రూటే సపరేటు అంటున్నారు భోపాల్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన వారికి వ్యాస రచన పోటీలు నిర్వహించి.. విజేతలకు ‘ప్రత్యేక బహుమతులు’ కూడా ప్రదానం చేయనున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వారు... ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ విషయమేమిటంటే... మధ్యప్రదేశ్‌లో శనివారం నుంచి 31 రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హెల్మెట్‌ ధరించకుండా బైకులు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించడం తరహా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను గురువారం రోడ్లపై నిలిపివేశారు. అనంతరం వారి చేతిలో పెన్ను- పేపర్‌ పెట్టి తామెందుకు హెల్మెట్‌ పెట్టుకోలేదో.. సీటు బెల్టు ఎందుకు ధరించలేదో తదితర కారణాలను వ్యాస రూపంలో రాయాల్సిందిగా కోరారు. వంద పదాల్లో వ్యాసం ముగించాలని.. ఈ పోటీలో అత్యుత్తమ వ్యాసాన్ని ఎంపిక చేసి వారికి హెల్మెట్లను ప్రదానం చేస్తామని చెప్పారు.

ఈ విధంగా గురువారం ఒక్కరోజే దాదాపు 150 మంది చేత భోపాల్‌ ట్రాఫిక్‌ పోలీసులు వ్యాసం రాయించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించిన వారికి జరిమానా విధించే కంటే.. ఇలా సున్నితంగా అర్థమయ్యేలా చెప్పడమే సులభమైన మార్గంగా తోచిందని డీఐజీ ఇర్షాద్‌ వలీ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు వాహనదారుల్లో తప్పక మార్పు తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ ‘వ్యాస రచన పోటీ’లకు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక మోటారు వాహన సవరణ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నిబంధనలు ఉల్లంఘించిన వారి జేబుకు చిల్లులు పడుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు