కొత్త వాదన: గుళ్లోకి అవన్నీ బంద్‌!

6 Jun, 2020 20:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: దేవాలయాల్లో ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లను అనుమతించేది లేదని మధ్యప్రదేశ్‌లోని ఓ పూజారి కొత్త వాదన లేవనెత్తారు. తమ ఆలయంలోకి ఆల్కహాల్‌ కలిగిన శానిటైజర్‌ మెషీన్లు తీసుకురావొద్దని శనివారం స్పష్టం చేశారు. భోపాల్‌లోని మా వైష్ణవధమ్‌ నవ్‌ దుర్గా ఆలయ పూజారి చంద్రశేఖర్‌ తివారీ ఈ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాగా, అన్‌లాక్‌-1లో భాగంగా జూన్‌ 8 (సోమవారం) నుంచి దేవాలయాలు పునఃప్రారంభవుతున్న సంగతి తెలిసిందే.

‘దేవాలయాల్లోకి శానిటైజర్లు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా నేను ఒప్పుకోను. దాంట్లో ఆల్కహాల్‌ ఉంటుంది. మద్యం తాగి గుళ్లోకి ఎవరైనా వెళ్తారా. ఇదీ అంతే. కావాలంటే చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు గుడి బయట సదుపాయాలు కల్పిస్తాం. భక్తులెవరైనా స్నానమాచరించాక నేరుగా దైవదర్శనానికి రావాలి’అని పేర్కొన్నారు.  

ఇదిలాఉండగా.. కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసి కేంద్రం.. ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లనే వాడాలని చెప్పిన విషయం విదితమే. దాంతోపాటు ఆరు ఫీట్ల భౌతిక దూరం పాటించాలని.. 40 నుంచి 60 సెకండ్లపాటు హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలని కేంద్రం చెప్పింది. ఇక దైవ దర్శనాలకు వెళ్ల భక్తులు వాహనాల్లోనే చెప్పులు విడిచి వెళ్లాలని, దేవుడి ప్రతిమలు, అక్కడున్న పురాతన వస్తువులను తాకొద్దని మార్గదర్శకాల్లో తెలిపింది.
(చదవండి: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..)

మరిన్ని వార్తలు