భుల్లర్‌కు శిక్ష తగ్గింపు

1 Apr, 2014 02:06 IST|Sakshi
భుల్లర్‌కు శిక్ష తగ్గింపు

మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన సుప్రీంకోర్టు
క్షమాభిక్ష నిర్ణయంలో జాప్యం,అనారోగ్యం నేపథ్యంలో నిర్ణయం
తీర్పుపై బిట్టా అసంతృప్తి.. ఆత్మాహుతి చేసుకుంటానని వ్యాఖ్య

 
 న్యూఢిల్లీ: ఖలిస్తాన్ ఉగ్రవాది దేవేందర్‌సింగ్ భుల్లర్‌కు సుప్రీం కోర్టు జీవితాన్ని ప్రసాదించింది. ఆయన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. భుల్లర్ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకొనేందుకు విపరీతమైన జాప్యం జరగడంతోపాటు ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనితో భుల్లర్ కుటుంబం పోరాటానికి ఫలితం లభించినట్లయింది. భుల్లర్ వయస్సు ప్రస్తుతం 48 ఏళ్లు.. ఆయన దాదాపు 19 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు.
 
1993లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎస్ బిట్టాను హత్యచేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట భుల్లర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ దాడిలో తొమ్మిది మంది చనిపోగా.. బిట్టా తీవ్రగాయాలతో బయటపడ్డారు.ఈ కేసులో భుల్లర్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మరణశిక్ష తీర్పును సమర్థించాయి.
 
దీంతో ఆయన 2003 జనవరిలో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ దాదాపు ఎనిమిదేళ్ల తీవ్ర జాప్యం అనంతరం క్షమాభిక్షను తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకున్నారు.క్షమాభిక్ష నిర్ణయంలో సుదీర్ఘ జాప్యంతో పాటు భుల్లర్ మానసిక స్థితి సరిగా లేదని, మరణశిక్షను తగ్గించాలని కోరుతూ భుల్లర్ భార్య నవనీత్ కౌర్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ‘‘క్షమాభిక్ష నిర్ణయంపై ఎలాంటి కారణాలు లేకుండా.. అసాధారణంగా, సుదీర్ఘ జాప్యం జరిగినట్లుగా న్యాయస్థానాలు భావిస్తే, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చవచ్చు. దీనికితోడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో భుల్లర్ శిక్షను మార్పు చేస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది.
 
 ఆత్మాహుతికి అనుమతివ్వండి..: బిట్టా

 భుల్లర్‌కు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పుచేయడం ఉగ్రవాదంపై పోరాడుతున్నవారికి పెద్ద అపజయమని.. కాంగ్రెస్ నేత, భుల్లర్ బాంబుదాడిలో ప్రాణాలతో బయటపడిన ఎం.ఎస్. బిట్టా వ్యాఖ్యానించారు. దీనితో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని.. కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ ఉగ్రవాదం చేతిలో ఓడిపోయిన తనకు బతకాలని లేదని చెప్పారు. తాను ఆత్మాహుతి చేసుకొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను, కోర్టును అనుమతి కోరుతానని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు