బీజేపీ నేతలకు పక్కలో బల్లెం!

17 Dec, 2018 19:18 IST|Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేష్‌ బగేల్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ సమక్షంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

కాగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే గిరిజన వాసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో భూపేశ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో బఘేల్‌తోపాటు సీనియర్‌ నేతలు టీపీ సింగ్‌ దేవ్‌, తమరాథ్‌వాజ్‌ సాహు, చరణ్‌దాస్‌ మహంత్‌లు సీఎం రేస్‌లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోయింది. దశల వారీగా పార్టీ సీనియర్‌ నేతలు, ఆశావహులతో చర్చలు జరిపిన అనంతరం భూపేష్‌ను సీఎంగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఒకే నియోజక వర్గం...
1986లో యూత్‌ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో పటాన్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్‌ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పాటైన(2000) తర్వాత 2003లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పటాన్‌ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేష్‌ తొలిసారిగా  సీఎంగా పదవి చేపట్టారు.

బీజేపీకి పక్కలో బల్లెం
ఛత్తీస్‌గఢ్‌ని దాదాపు 15 ఏళ్లుగా పాలిస్తున్న బీజేపీకి చెక్‌ పెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిన భూపేశ్‌ బఘేల్‌ మధ్యప్రదేశ్‌లోని(ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌) దుర్గ్‌ జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న జన్మించారు. చందూలాల్‌ చంద్రశేఖర్‌ ప్రోద్బలంతో 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం యూత్‌ కాంగ్రెస్‌లో చేరారు. 1994–95లో మధ్యప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. క్రమంగా మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు.

కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేశ్‌కు రాష్ట్రంలో ఉన్న 52 శాతం మంది ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. 1993లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బఘేల్‌.. అజిత్‌ జోగీతో పాటు దిగ్విజయ్‌ సింగ్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. భూపేశ్‌ బఘేల్‌ సంఘ సంస్కర్తగా పేరుపొందారు. పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్‌ లో సామూహిక వివాహాలు జరిపించారు.

అంతేకాకుండా బీజేపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడటంతో పాటు ఓ బీజేపీ నేతకు సంబంధించిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో బఘేల్‌ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బఘేల్‌తో పాటు ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడ్డారని రమణ్‌సింగ్‌ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. అంతేకాకుండా సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటిని ఓపికగా సహించిన భూపేశ్‌ బఘేల్ నేడు ఛత్తీస్‌గఢ్‌ మూడో ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు. బఘేల్‌కు ముందు అజిత్‌ జోగి(మూడేళ్లు), రమణ్‌సింగ్‌(15 సంవత్సరాలు) ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్యాలెట్లలో పొరపాట్లు.. మారిన తలరాతలు 

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

‘చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారు’

మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?

వైఎస్సార్‌సీపీకే మద్దతు

నామినేషన్‌ వేయబోతే జైలుకు పంపారు!

బయటకెళ్తే భయమేస్తోందమ్మా

మన్మోహన్‌ కన్నా మోదీనే మేలు : షీలా దీక్షిత్‌

‘ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రూ.100 కోట్ల ఆఫర్‌’

ఆ మంత్రులంతా కోటీశ్వరులే!

మభ్యపెట్టి విజయం సాధించారు

మంత్రివర్గ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు

కాంగ్రెస్‌కు దాసోహమంటారా?

రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు: వైఎస్‌ జగన్‌

‘ఎర్రబెల్లి కోసం జూపల్లిని ఓడగొట్టారు’

ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా

హస్తానికి గులాబీ దెబ్బ

మండలిపై టీఆర్‌ఎస్‌ నజర్‌

పంచాయతీల్లో ఎవరికెన్ని రిజర్వేషన్లు