నేను బిగ్ బీ ని కాదు: అమితాబ్

29 May, 2016 10:46 IST|Sakshi
నేను బిగ్ బీ ని కాదు: అమితాబ్

న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్ డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియా గేట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమ ప్రాధాన్యాన్ని అమితాబ్ వివరించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుకోవాల్సిన ఆవశ్యకత గురించి అమితాబ్ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక బాలిక ప్రశ్నకు అమితాబ్ నేలపై కూర్చొని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఏడవ తరగతి విద్యార్థిని సుగమ్ అమితాబ్ ఉద్దేశించి మీరు బిగ్ బీ ఎలా అయ్యారు? మీ చిన్ననాటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను? అని అడిగింది. వెంటనే అమితాబ్ కింద కూర్చొని.. ఎవరు చెప్పారు నేను బిగ్ బీ అని, చూడు నేను నీకన్నా చిన్నగా ఉన్నాను అని చమత్కరించారు. దీంతో అక్కడున్న వాళ్లందరిలో నవ్వులు విరిసాయి. బిగ్ బీ అనేది మీడియా, ప్రజలు ఇచ్చిన బిరుదు అని అన్నారు. అంతేకాని బిగ్ బీలు ఎవరూ లేరన్నారు.

ప్రతీ ఒక్కరూ చదువుకొని ఉన్నత లక్ష్యం దిశగా కృషి చేయాలని వారికి అమితాబ్ సూచించారు. ఈ సందర్భంగా తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ రచించిన 'మధుశాల'లోని కొన్ని పంక్తులను అమితాబ్ ఉదహరించారు. విద్యార్థులు రాసిన రెండు పద్యాలను కూడా ఆయన చదివారు.  'బేటీ బచావో-బేటీ పడావో' ఉద్దేశాన్ని వివరిస్తూ.. ఆడ, మగ పిల్లల మధ్య  ఎటుమంటి వివక్ష చూపకూడదని అన్నారు.  మన పూర్వీకులు  మహిళలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు