హిందూ, ముస్లింల కోసమా రక్షాబంధన్‌?

7 Aug, 2017 15:47 IST|Sakshi
హిందూ, ముస్లింల కోసమా రక్షాబంధన్‌?

న్యూఢిల్లీ: దేశంలో పశ్చిమ బెంగాల్‌ రూటే సెపరేట్‌. దేశమంతా పండుగలను పబ్బాలను ఏకరీతిన జరుపుకుంటే బెంగాల్‌ ప్రజలు అందుకు భిన్నంగా జరుపుకుంటారు. దేశ ప్రజలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటే, బెంగాల్‌ ప్రజలు దుర్గా పూజ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. విజయదశమి సందర్భంగా దేశమంతా దసరా వేడుకలను జరుపుకుంటే బెంగాల్‌ ప్రజలు దసరా రోజున కన్నీళ్లు పెట్టుకుంటారు. వారు రాఖీ పండుగను కూడా హిందూ, ముస్లిం ప్రజల సమైక్యతకు చిహ్నంగా జరపుకుంటారు. అంతా విస్తృతంగా లేకపోయినా ఈ రోజున కూడా వారు భాయి, భాయి అంటూ పరస్పరం రాఖీలు కట్టుకొని భిన్న మతాల సమైక్యత గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు.

విభజించు పాలించు సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్న నాటి బ్రిటీష్‌ పాలకులు, హిందూ ముస్లింలు ఎక్కువగా ఉన్న సువిశాల బెంగాల్‌ను మతం ప్రాతిపదికన విభజించాలనుకున్నారు. పాలనాపరమైన సౌలభ్యం పేరిట ముస్లింలు ఎక్కువగా వున్న తూర్పు ప్రాంతాన్ని ఒక ప్రాంతంగా (ప్రస్తుత బంగ్లాదేశ్‌), హిందువులు ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంగా విభజించాలని 1905, ఆగస్టు నెలలో నిర్ణయించారు. అందుకు అప్పటి బ్రిటిష్‌ ఇండియా వైస్‌రాయ్, గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జాన్‌ అక్టోబర్‌ 16వ తేదీన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.


బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరించాలంటూ  ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. బెంగాల్‌ విభజనను అడ్డుకోవాలంటే హిందూ, ముస్లింల మధ్య ఐక్యత పెరగాలని, ఇరుమతాలు ఐక్యతతో పోరాడితే బెంగాల్‌ విభజనను అడ్డుకోవచ్చని నోబెల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత రవీంద్ర నాథ్‌ టాగూర్‌ భావించారు. హిందూ, ముస్లింల మధ్య సమైక్యతను చాటుతూ బెంగాల్‌ ప్రజలెవరూ అక్టోబర్‌ 16వ తేదీన ఇంట్లో వంటచేయరాదని, ఇరుమతాల వారు ఒకరికొకరు రక్షించుకునే విధంగా పరస్పరం రాఖీలు లేదా రక్షాబంధన్‌లు కట్టుకోవాలని పిలుపునిచ్చారు.

నాడు అక్టోబర్‌ నెల శ్రావణ మాసంలో రావడంతో టాగూర్‌ తన పిలుపును విజయవంతం చేయడం కోసం ఉదయమే గంగానదికి వెళ్లి పవిత్రస్నానమాచరించి అక్కడి నుంచి ప్రజలతో ఓ ప్రదర్శనగా కోల్‌కతా నగరంలోకి వస్తూ దారిలో కనిపించిన వారందరికి రాఖీలు కడుతూ వచ్చారు. మసీదుల్లోకి వెళ్లి మౌల్వీలకు కూడా రక్షాబంధన్‌లు కట్టారు. అలా హిందూ ప్రజలు ఓ ఊరేగింపులా మసీదుల్లోకి దూసుకుపోయినా మౌల్వీలెవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. బెంగాల్‌ రక్షణ, ఐక్యత కొనసాగాలని ఆకాంక్షిస్తూ టాగూర్‌ స్వయంగా రాసిన పాటను ప్రజలు ఆలపిస్తూ ప్రదర్శన వెంట ముందుకు సాగారు. హిందూ ముస్లింలకు ఐక్యతకు చిహ్నంగా ఫెడరేషన్‌ హాలు నిర్మాంచాలనుకున్న చోటు వరకు వారి ప్రదర్శన సాగింది.


అక్కడ భవన నిర్మాణానికి టాగూర్‌ శంకుస్థాపన చేశారు. వాస్తవానికి బారిస్టర్‌ ఆనంద్‌ మోహన్‌ బోస్‌ అక్కడ ఉపన్యాసం ఇవ్వాల్సి ఉండింది. అనుకోకుండా ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆయన ప్రసంగ పాఠాన్ని టాగూర్‌ చదవి వినిపించారు. అదే సందర్భంగా భవన నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలు వసూలు చేశారు.

అనంతరం అక్కడి నుంచి ప్రజల రాఖీ యాత్ర బాగ్‌బజార్‌లోని పాసుపతి, నంద్‌లాల్‌ బసు ఇల్లైన బసు బాటి వద్దకు కొనసాగింది. అప్పటి నుంచి బెంగాల్‌ ప్రజలు రాఖీ పండుగను హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా జరుపుకుంటూ వచ్చారు. దాంతో బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం బెంగాల్‌ విభజనపై వెనక్కి తగ్గింది. 1911లో బెంగాల్‌ విభజన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. మరో ఏడాదికి, అంటే 1912లో మళ్లీ బెంగాల్‌ను విభజించాలని నిర్ణయించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా