సంఝౌతా కేసులో స్వామి అసీమానందకు ఊరట

20 Mar, 2019 18:38 IST|Sakshi


సాక్షి, న్యూఢిల్లీ : సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ పేలుళ్ల కేసులో స్వామి అసీమానందతో పాటు నలుగురిని ఎన్ఐఏ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది. 12 ఏళ్ళ తరువాత సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బాంబు పేలుళ్ళ కేసులో హర్యానా లోని పంచకుల ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. బాంబు పేలుళ్లలో నిందితుల హస్తం ఉందని నిరూపించే సాక్షాలు సమర్పించడంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విఫలమవడంతో స్వామి అసీమానంద సహా నలుగురు నిం‍దితులకు పంచకుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్  ఊరట కల్పించింది.

2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో ఐఈడీ పేలుడులో 63 మంది ప్రయాణికులు మరణించారు. బాధితులు పాకిస్తాన్‌కు చెందిన వారు కావడం గమనార్హం. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం అఠారీకి వెళుతుండగా హర్యానాలోని పానిపట్‌ జిల్లా దీవానా రైల్వేస్టేషన్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు కేసుపై దర్యాప్తునకు ఫిబ్రవరి 20, 2007న సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2010లో కేసును ఎన్‌ఐఏకు బదలాయించింది. కాగా దర్యాప్తులో భాగంగా 290 మంది సాక్షులను ఎన్‌ఐఏ విచారించింది.

ఈ కేసులో స్వామి అసీమానంద, సునీల్ జోషి, లోకేష్ శర్మ, సందీప్ డాంగే, రామచంద్ర కలసాంగ్ర, రాజేంద్ర చౌదరి, కమల్ చౌహాన్లను దోషులుగా ఎన్‌ఐఏ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న సునీల్ జోషి  2007 లో మధ్యప్రదేశ్ దీవాస్ లో మరణించగా, ఇతర నిందితులు  రామచంద్ర కలసాంగ్ర, సందీప్ డాంగేల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం

మరిన్ని వార్తలు