దేవయానికి ప్రమోషన్‌

28 Mar, 2018 12:57 IST|Sakshi
దేవయాని ఖోబ్రగడే (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : పనిమనిషి పాస్‌పోర్టు విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారని, ఆమెకు సరిగా జీతం చెల్లించకుండా వేధింపులకు గురిచేశారనే కారణంగా 2013లో అరెస్టైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు సెంట్రల్‌ అడ్మినిస్ట్రేవ్‌ ట్రిబ్యునల్‌(క్యాట్‌)లో ఊరట లభించింది. 1999 బ్యాచ్‌కు చెందిన దేవయానికి పదోన్నతి కల్పించడంతో పాటు 2016 నుంచి దీనిని వర్తింపచేయాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను క్యాట్‌ ఆదేశించింది. దీంతో జాయింట్‌ సెక్రటరీగా ఆమె పదోన్నతి పొందనున్నారు. ఆమెపై నమోదైన కేసు విచారణలో జాప్యం చేసినందుకు ఆ శాఖను తప్పుపట్టింది.

భారత్‌కు చెందిన తన పనిమనిషి సంగీత రిచర్డ్‌ వీసా విషయంలో తప్పుడు పత్రాలు సమర్పించారనే కారణంతో 2013లో న్యూయార్క్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దీనివల్ల భారత్‌- అమెరికాల మధ్యనున్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. మీడియాలో కూడా ఈ విషయం గురించి చర్చ జరగడంతో దేవయానిపై విమర్శలు వెల్లువెత్తాయి. తన  పిల్లల పౌరసత్వానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసిందనే కారణంగా విదేశీ వ్యవహారాల శాఖ ఆమె ప్రమోషన్‌ను నిలిపివేసింది. అంతేకాకుండా తండ్రితో పాటు అమెరికాలో నివసిస్తున్న దేవయాని ఇద్దరు కుమార్తెలకు భారత పౌరసత్వాన్ని తిరస్కరించింది. ఇండియన్‌ పాస్‌పోర్టు, పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘించించారన్న ఆరోపణలతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ అంశం గురించి దేవయాని మాట్లాడుతూ... ‘ఈ కేసులో పిటిషనర్‌ తల్లి(దేవయాని) ఎప్పుడూ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయలేదు. తన భర్త, తనపై ఆధారపడిన వారి గురించి కూడా విదేశీ పౌరసత్వం కల్పించాలని కోరలేదు. భారత విదేశీ విధానం-1961 నిబంధనల ప్రకారం ఇది చట్టాన్ని మీరినట్టు కాదు. 16 ఏళ్ల సర్వీసులో నేను చాలా బాగా పనిచేశానని’ పేర్కొన్నారు. ఈ అంశాల గురించి అఫిడవిట్‌లో కూడా ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు