అగస్టా కంటే పెద్ద కుంభకోణం!

13 May, 2016 18:53 IST|Sakshi
అగస్టా కంటే పెద్ద కుంభకోణం!

న్యూఢిల్లీ: దేశంలో దుమారం రేపుతోన్న అగస్టా కుంభకోణంకు సంబంధించి విచారణ జరుగుతుండగా.. యూపీఏ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం బయటపడింది. దేశ రక్షణకు ఉపయోగపడే యుద్ధ నౌకల తయారీలో ఈ స్కామ్ జరగడంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అంతర్గత విచారణకు ఆదేశించారు.

2009లో రెండు కొత్త నావల్ ట్యాంకర్ల కోసం యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ట్యాంకర్లను తయారుచేసి ఇచ్చేందుకు రష్యా, కొరియా, ఇటలీలు బిడ్ లు దాఖలు చేశాయి. వీటిలో రష్యా మిలటరీ గ్రేడ్ స్టీల్ తో తయారుచేసి అందిస్తామని తెలపగా.. తమకు ఆ రకం స్టీల్ అవసరం లేదని ప్రభుత్వం చెప్పడంతో రష్యా డీల్ నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో పోటీలో నిలిచిన రెండింటిలో ఇటాలియన్ కంపెనీ ' ఫిన్కాంటైరీ ' డీల్ ను చేజిక్కించుకుంది. 2010లో 'కాగ్' ట్యాంకర్ల డీల్ లో లోపాలు ఉన్నట్లు, కంపెనీకి లాభం చేకూరేట్లు డీల్ ను ఇచ్చినట్లు పేర్కొంది. అక్కడితో ఆగిపోయిన ఈ విషయం తాజాగా ఓ రిటైర్డ్ నావల్ అధికారి వేసిన పిటిషన్ తో మళ్లీ వెలుగులోకి వచ్చింది.

కొత్త ట్యాంకర్లు ఎందుకోసం?

దేశ అతిపెద్ద విమాన రవాణా నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకురావాల్సి ఉండగా.. నౌక రక్షణ కోసం ఈ రెండు ట్యాంకర్లను 2009, 2011లలో భారతీయ స్ఫెసికేషన్స్ తో అత్యంత వేగంగా భారతీయ నావికాదళంలోకి తీసుకున్నారు. విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకువస్తున్న తరుణంలో రెండింటిలో ఒక ట్యాంకర్ బీటలు వారింది.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇటాలియన్ కంపెనీకే ఆ డీల్ ను ఇవ్వడానికి గల కారణాలను, డీల్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగ్ ఆరోపణలు, నేవీ అధికారి ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తోంటే యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం త్వరలో బహిర్గతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు