బలనిరూపణ నేడే

28 Jul, 2017 00:41 IST|Sakshi
బలనిరూపణ నేడే

► 132 మంది మద్దతుపై ఎన్డీయే ధీమా
► సీఎంగా నితీశ్‌ ప్రమాణ స్వీకారం
► బీజేపీ నుంచి సుశీల్‌ మోదీ ప్రమాణం
► ఏ నిర్ణయమైనా బిహార్‌ కోసమే: నితీశ్‌ కుమార్‌


పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌ (66) గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠీ నితీశ్‌తోపాటుగా బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌ కుమార్‌ మోదీతోనూ ప్రమాణం చేయించారు. బిహార్‌ ప్రగతిని దృష్టిలో పెట్టుకునే కూటమినుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రమాణ స్వీకారం అనంతరం నితీశ్‌ వెల్లడించారు. కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు బిహార్‌ అసెంబ్లీలో నితీశ్‌ బలనిరూపణ చేసుకోనున్నారు.

బీజేపీ సంపూర్ణ మద్దతు తెలపటంతోపాటుగా ఎన్డీయేలోని ఇతర పక్షాలు కూడా మద్దతివ్వటంతో విశ్వాస పరీక్షలో నితీశ్‌ విజయం దాదాపు ఖాయంగానే కనబడుతోంది. నితీశ్‌ నిర్ణయంపై జేడీయూ సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మహాకూటమినుంచి వైదొలిగే అంశంపై తనను సంప్రదించకపోవటాన్ని శరద్‌ యాదవ్‌ తప్పుపట్టినట్లు తెలుస్తోంది.  జేడీయూ రాజ్యసభ ఎంపీలు వీరేం ద్ర కుమార్, అలీ అన్వర్‌ కూడా నితీశ్‌ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవేవీ పార్టీ బలనిరూపణపై ప్రభావం చూపబోవని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి 132 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్నారు.

ఘనంగా ఎన్డీయేలోకి..
బిహార్‌ సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్‌.. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా బిహార్‌ ప్రజల మేలుకోసమే. ఇది పార్టీ సమష్టి నిర్ణయం. మేమంతా ప్రజలకోసం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తనను రాజకీయ అవకాశవాదిగా పేర్కొనటంపై స్పందిస్తూ.. ‘రాహుల్‌ వ్యాఖ్యలకు సరైన సమయంలో సమాధానమిస్తాం’ అని అన్నారు. 

రాష్ట్రంలో ఎన్డీయే సుపరిపాలన తిరిగి ప్రారంభమైందని సుశీల్‌ మోదీ (ఉప ముఖ్యమంత్రి) తెలిపారు. ‘గత 20 నెలలుగా రాష్ట్రంలో కొంత స్తబ్దత నెలకొంది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి పట్టాలెక్కుతుంది’ అని ఆయన తెలిపారు. ప్రమాణ స్వీకారం కాగానే.. ‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పార్లమెంటు ఉభయసభల్లో మా సంపూర్ణ మద్దతుంటుంది’ అని జేడీయూ ప్రకటించింది. అటు ప్రధాని మోదీ మరోసారి నితీశ్, సుశీల్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

కూటమితో దోస్తీ చారిత్రక తప్పిదం
బిహార్‌లో తాజా మార్పులపై బీజేపీ పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌ జైన్‌ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.  అతిపెద్ద పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకోసం తమకు అవకాశం ఇవ్వకపోవటంపై నిరసన తెలుపుతున్నట్లు ఆర్జేడీ ప్రకటించింది. ఆర్జేడీతో కలవటం జేడీయూ చేసిన అతిపెద్ద తప్పిదమని కేసీ త్యాగి తెలిపారు. అందుకోసం చింతిస్తున్నామన్నారు.

సీబీఐ కేసులనుంచి తప్పించుకునేందుకు కేంద్ర మంత్రులతో లాలూ రహస్య మంతనాలు జరిపారని, నితీశ్‌ సర్కారును పడగొట్టేందుకు కుట్రపన్నారని త్యాగి విమర్శించారు. కాగా, బుధవారం అర్ధరాత్రి దాటాక గవర్నర్‌ను కలిసిన ఎన్డీయే బృందం.. నితీశ్‌కు మద్దతుగా 132 మంది (జేడీయూ 71, బీజేపీ 53, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 2, ఎల్‌జేపీ 2, హెచ్‌ఏఎం 1, ముగ్గురు స్వతంత్రులు) ఎమ్మెల్యేల జాబితాను అందజేసింది. పలువురు ఆర్జేడీ శాసనసభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని  జేడీయూ నేతలంటున్నారు.

‘నా నా కర్తే’: అఖిలేశ్‌
బీజేపీతో నితీశ్‌ దోస్తీపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ వ్యంగ్యంగా స్పందించారు. 1965 నాటి బాలీవుడ్‌ పాట ‘నా నా కర్తే ప్యార్‌ తుమ్హీసే కర్‌ బైఠే..’ (వద్దు వద్దంటూనే మీతో ప్రేమలో పడ్డాను) పాట నితీశ్‌కు సరిపోతుందని ట్విటర్‌లో విమర్శించారు. బీజేపీపై విమర్శలు చేస్తూనే.. ఆ పార్టీతోనే నితీశ్‌ దోస్తీ కుదుర్చుకున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు