ముఖ్యమంత్రికి 10 ఆవులు, 7 లేగదూడలు..!

1 Jan, 2020 20:49 IST|Sakshi

పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఆస్తిలో ఏడాది కాలానికి ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. అయితే, ఆయన పాడి సంపదలో మాత్రం కొత్తగా రెండు ఆవులు, ఒక లేగ దూడ చేరింది. ఏడాది క్రితం 8 ఆవులు ఉండగా.. మరో రెండు ఆవులు వాటికి జత చేరాయి. 6 లేగ దూడలు ఉండగా.. మరో బుల్లి లేగ వచ్చింది. తనతోపాటు మంత్రుల ఆదాయ వివరాలు, ప్రభుత్వ పనితీరుపై నితీష్‌ వార్షిక నివేదిక విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మూడోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో 2010 నుంచి నితీష్‌ ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. 2019కి చెందిన వార్షిక నివేదికను ఆయన మంగళవారం విడుదల చేశారు. దాని ప్రకారం.. చివరి ఏడాది ఆయన వద్ద రూ.42 వేల నగదు ఉండగా.. అది నేడు 38,039 రూపాయలకు చేరింది.

చరాస్తులు రూ.16 వేలు, స్థిరాస్తులు రూ.40 లక్షలు ఉన్నాయి. నితీష్‌ తనయుడు పేరిట రూ.1.39 కోట్లు చరాస్తులు, రూ.1.48 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. నితీష్‌ కేబినెట్‌ మంత్రుల ఆదాయంలో గతేడాది మాదిరిగానే పెరుగుదల నమోదైంది. రూ.9 కోట్ల ఆస్తులతో సురేష్‌ శర్మ ధనవంతుడిగా ఉండగా.. మంత్రి నీరజ్‌ కుమార్‌ వద్ద రూ.27 లక్షలు మాత్రమే ఉన్నాయి. అందరి మంత్రుల్లో ఇతనే తక్కువ ఆస్తిపరుడు. ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీకు రూ.1.26 కోట్ల ఆస్తి, ఆయన భార్యకు రూ.1.65 కోట్ల ఆస్తి ఉంది. మోదీ బ్యాంకు అకౌంట్‌లో రూ.81.54 లక్షలు, ఆయన భార్య అకౌంట్‌లో రూ.97.18 లక్షలు ఉన్నాయి. గతేడాది నితీష్‌ కేబినెట్‌లోకి వచ్చిన సంజయ్‌ ఝా రూ.22 కోట్ల ఆస్తులు కలిగి ఉండటం గమనార్హం. 2020 ప్రారంభంలో బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు