ఉద్యోగులకు సర్కార్‌ దివాళీ కానుక

25 Oct, 2018 12:28 IST|Sakshi

పట్నా: దీపావళికి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిహార్‌ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యోగులకు ప్రస్తుతం ఏడు శాతంగా ఉన్న డీఏను 9 శాతానికి పెంచేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పెరిగిన డీఏను ఈ ఏడాది జులై 1 నుంచి వర్తింపచేస్తామని కేబినెట్‌ సెక్రటేరియట్‌ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, సవరించిన వేతనాలను అందుకుంటున్న ఫ్యామిలీ పెన్షనర్లు ఈ పెంపునకు అర్హులని కుమార్‌ తెలిపారు.

డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ 419 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. మరోవైపు పెన్షన్‌ స్కీమ్‌లో ప్రస్తుతమున్న 3.09 కోట్ల ఉద్యోగుల సంఖ్యను 6 కోట్ల ఉద్యోగులకు పెంచాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌ ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు.

మరోవైపు ఏడవ వేతన సంఘ సిఫార్సులకు అతీతంగా కనీస వేతనం, ఫిట్‌మెంట్‌లను పెంచాలని 50 లక్షల మంది కేం‍ద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్‌ను ఆర్థిక శాఖ సహాయ మంత్రి పీ రాధాకృష్ణన్‌ తోసిపుచ్చారు. కాగా ఇప్పటికే ఏడవ వేతన సంఘం సిఫార్సులను పలు రాష్ట్రాలు అమలుచేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు