39 మంది బిహార్‌ గ్రామస్థులపై కేసు నమోదు

25 Jun, 2019 20:12 IST|Sakshi

పట్నా : బిహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా దాదాపు 160 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి.. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేశారు అధి​కారులు. వివరాలు.. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో మెదడువాపు వ్యాధి విజృంభిస్తూ.. చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో హరివంశపూర్‌ గ్రామస్థులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు మరణించారంటూ ఆందోళన చేపట్టారు. బాధితుల కడుపుకోతను అర్థం చేసుకుని.. ఓదార్చాల్సింది పోయి.. వారి మీదనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా దాదాపు 39 మంది మీద ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు.

ఈ విషయం గురించి బాధితుల బంధువులు మాట్లాడుతూ.. ‘మా పిల్లలు చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. ఆ కోపాన్ని తెలియజేయడానికి రోడ్డు బ్లాక్‌ చేసి నిరసన తెలిపాం. కానీ అధికారులు మా వాళ్ల మీద కేసు నమోదు చేశారు. దాంతో మగవారు తమను అరెస్ట్‌ చేస్తారనే భయంతో గ్రామం విడిచి వెళ్లారు. కుటుంబాన్ని పోషించేవారిని అరెస్ట్‌ చేస్తే.. మా బతుకులు సాగెదేలా’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
 

చిన్నారుల మృతులపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది.  చిన్నారుల మృతులపై దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బిహార్‌, యూపీ ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగే నోటీసులకు బదులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు