ఇక మొత్తానికే మద్యం బంద్

5 Apr, 2016 15:18 IST|Sakshi
ఇక మొత్తానికే మద్యం బంద్

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రెండు మూడు రోజుల కిందట మద్యంపై స్వల్పంగా నిషేధం విధించిన ఆయన ఇక సంపూర్ణ నిషేధ ప్రకటన చేశారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ విధమైన మద్యం విక్రయించినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో ప్రొహిబిషన్ డే సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని, మద్యం కారణంగా చిన్నచిన్న కుటుంబాలే కాకుండా ఎంతోమంది జీవితాలు చిద్రమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ ప్రకారమే ఏప్రిల్ 1న తొలుత గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం ప్రకటించారు. 'ఏ బార్లలోనూ, పబ్బుల్లోనూ ఇకనుంచి మద్యం విక్రయాలు జరపరాదు. రాష్ట్రమంతటా మద్యంపై నిషేధం విధించాము. ఇది ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. మహిళలు, పిల్లలు, యువకులు మేం తీసుకున్న ఈ నిర్ణయానికి అనుకూలంగా పనిచేయాలి' అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు.

ఆర్మీకి మాత్రం ఆయన మినహాయింపును ఇస్తున్నట్లు చెప్పారు. లిక్కర్ బ్యాన్ కారణంగా ఎవరైతే ఉపాధి కోల్పోతున్నారో వారందరి త్వరలోనే మంచి ఉద్యోగ బాట చూపిస్తామని నితీష్ చెప్పారు. తాజాగా, బిహార్ తీసుకున్న నిర్ణయంతో మద్యంపై పూర్తి నిషేధం విధించిన నాలుగో రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటికే నాగాలాండ్, మణిపూర్, గుజరాత్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. 

మరిన్ని వార్తలు