జైలర్‌ గదిలోనే ఖైదీ, గ్యాంగ్‌స్టర్‌ సంసారం!

14 Jan, 2016 11:55 IST|Sakshi
జైలర్‌ గదిలోనే ఖైదీ, గ్యాంగ్‌స్టర్‌ సంసారం!

పట్నా: ఒకప్పుడు జైలులో ఊచలు లెక్కబెడుతున్నా ఖైదీలకు యథేచ్ఛగా సెల్‌ఫోన్లు, మాదక ద్రవ్యాలు, విలాస వస్తువులు అందేవి. ఖైదీలతో జైలు సిబ్బంది కుమ్మక్కై.. ఇలాంటి చిన్న చిన్న సేవలు అందించడం కారాగారాల్లో నిత్యకృత్యంగా జరుగుతున్నా.. ఈ విషయంలో బిహార్ జైలు సిబ్బంది మరో అడుగు ముందుకువేశారు. జైలు గదిలోనే ఓ గ్యాంగ్‌స్టర్‌, అతని భార్య అయిన అండర్ ట్రయల్‌ ఖైదీ సంసారం చేసుకోవడానికి వీలు కల్పించినట్టు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బిహార్‌లోని షివోహర్‌ జైలులో అండర్ ట్రయల్‌ ఖైదీ పూజకుమారి గర్భం దాల్చిన వ్యవహారంపై దర్యాప్తు జరుపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న తన భర్త, గ్యాంగ్‌స్టర్‌ ముఖేశ్‌ పాఠక్‌ను ఆమె తరచూ జైలులోని అసిస్టెంట్ జైలర్‌ కార్యాలయంలో కలిసేదని, ఇద్దరు కాపురం చేసిన ఫలితంగా ఆమె గర్భం దాల్చిందని వెలుగుచూడటం విస్మయపరుస్తోంది. గత ఏడాది ఈ భార్యాభర్తలు ఇద్దరూ వేర్వురు కేసుల్లో షివోహర్‌ జైల్లో ఖైదీలుగా ఉన్నారు. ఆ సమయంలో వీరు వేరువేరు గదుల్లో దూరంగా ఉన్నా.. జైలు సిబ్బందికి తాయిలాలు ముట్టజెప్పి.. అసిస్టెంట్‌ జైలర్‌ కార్యాలయంలో తరచూ కలుసుకొనేవారని తాజా దర్యాప్తులో తేలింది. షివోహర్ జిల్లా మేజిస్ట్రేట్‌, ముజఫర్‌పుర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఈ దర్యాప్తు నిర్వహించారు.

ఉత్తర బిహార్‌లో బలమైన నేరగాడైన సంతోష్‌ షా గ్యాంగ్‌లో షార్ప్‌షూటర్‌ అయిన ముఖేశ్‌ పాఠక్‌ దర్భాంగ ఇంజినీర్ల హత్యకేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. జైలు నుంచి పరారైన అతడు ప్రస్తుతం నేపాల్‌లో తలదాచుకుంటున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు