బాలికలపై అకృత్యాలు : బిహార్‌ మంత్రి రాజీనామా

8 Aug, 2018 18:14 IST|Sakshi

పట్నా : దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం చిన్నారులపై జరిగిన అకృత్యాల ఘటనకు సంబంధించి బిహార్‌ మంత్రి మంజూ వర్మ రాజీనామా చేశారు. ఈ కేసులో ఆమె పాత్రపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో భేటీ అనంతరం మంత్రి పదవి నుంచి వైదొలుగుతున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజూ వర్మ వెల్లడించారు.

ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, హోం నిర్వాహకుడు బ్రజేష్‌ ఠాకూర్‌తో మంజూ వర్మ భర్తకు సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. మంబయికి చెందిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ చేపట్టిన సామాజిక ఆడిట్‌లో షెల్టర్‌ హోంలో మైనర్‌ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను వెలుగులోకి తెచ్చాయి.

హోంలో ఆశ్రయం పొందుతున్న 40 మంది బాలికల్లో సగానికి పైగా బాలికలపై లైంగిక దాడులు జరిగినట్టు వైద్య నివేదికల్లో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయగా, షెల్టర్‌ హోంను బిహార్‌ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. బాలికలను ఇతర జిల్లాల్లోని వసతి గృహాలకు తరలించి షెల్టర్‌ హోంను అధికారులు సీజ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు