జైట్లీని ఎందుకు దూరంగా పెట్టారు?

1 Oct, 2015 14:44 IST|Sakshi
జైట్లీని ఎందుకు దూరంగా పెట్టారు?

 పాట్నా: బీహార్‌లో జరిగిన గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనతాదళ్ (యు) కూటమిని విజయపథాన నడిపించిన  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈసారి ఎందుకు బీహార్ ఎన్నికలకు దూరంగా ఉన్నారు? వ్యూహరచన గురించి పక్కన పెట్టిన కనీసం ఎన్నికల ప్రచారంలోనైనా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయనే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా లేదా పార్టీయే ఆయనను పక్కన పెట్టిందా ?

 2005లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహకర్తగా ఆయనే పని చేశారు. ఎవరూ ఊహించనివిధంగా మొట్టమొదటిసారిగా పార్టీకి 58 సీట్లను కట్టబెట్టారు. 88 సీట్లను సాధించిన జనతాదళ్ (యు)తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవంతో 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని విజయపథాన నడిపించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 91, జేడీయూకు 115 సీట్లు వచ్చాయి. గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లో కూడా  బీజేపీ విజయానికి  కారణమైన జైట్లీని మంచి ఎన్నికల వ్యూహకర్తగా, మేధావిగా పార్టీ శ్రేణులు కీర్తించాయి.

కారణం ఏదైనా ఈసారి మాత్రం బీహార్ ఎన్నికల విషయంలో పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికల్లో పార్టీ విజన్ డాక్యుమెంటును విడుదల చేయడానికే పరిమితం చేసింది. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలే ఎన్నికల వ్యూహరచన చేయగా వారికి సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, జేపీ నడ్డా, రవి శంకర్ ప్రసాద్, రాజీవ్ ప్రతాప్ రూఢీ సహకరిస్తున్నారు.
 
 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవమే కారణమా?
 పార్టీ ఎన్నికల విజయ సారథిగా గుర్తించినందునే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సారథ్యం వహించాల్సిందిగా పార్టీ మళ్లీ అరుణ్ జైట్లీని కోరింది. ఢిల్లీతో ఆయనకు, ఆయన కుటుంబానికున్న అనుబంధం కూడా పార్టీ విజయానికి ఉపయోగపడుతుందని భావించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, ధర్మేంధ్ర ప్రధాన్‌లను తీసుకొని జైట్లీ ఎన్నికల ప్రచార రంగంలోకి దూకారు. ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ సృష్టించిన పెను తుపానులో జైట్లీ అదృష్టం కాస్త కొట్టుకుపోయింది. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం బీజేపీకి మూడంటే మూడు సీట్లు మాత్రమే వచ్చాయి.


 అప్పటి వరకు అజేయమైన ఎన్నికల వ్యూహకర్తగా జైట్లీని వర్ణించిన ద్వితీయ శ్రేణి పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా దుమారం రేపారు. మోదీ ఇమేజ్, అమిత్ షా వ్యూహాలపై పూర్తిగా ఆధారపడకుండా జైట్లీని నమ్ముకోవడం వల్లనే పార్టీ నట్టేట మునిగిందంటూ విమర్శలు కురిపించారు. అందుకే ఇప్పుడు ఆయన్ని దూరంగా పెట్టి మోదీ, అమిత్ షాలను నమ్ముకొని బీహార్ బరిలో ముందుకు దూసుకుపోతున్నామని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరిన్ని వార్తలు