అతడు బయటే ఉంటే.. నా కూతురు బతకదు

7 Oct, 2016 10:51 IST|Sakshi
రాజ్ బల్లబ్ యాదవ్
పాట్నా: మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుడిగా  ఉండి ఇటీవల బెయిల్పై విడుదలైన ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లబ్ యాదవ్ బయటే ఉంటే తన కూతురు పనైపోయినట్లే అని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. అతడు బయటే ఉంటే నేను పోరాడలేను. ఇక నా కూతురు పనైపోయినట్లే అని చిన్న పాన్షాప్ నిర్వహిస్తున్న బాలిక తండ్రి జాతీయ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఆందోళన వ్యక్తంచేశాడు. 
 
ఇటీవల బాధిత బాలిక 'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నాకు జరిగిన సంఘటనతో ఇప్పటికే నేను చచ్చిపోయిన దాన్ని. నేను కోల్పోయేందుకు ఇంకేం లేదు. నేను ఇప్పుడు నా కుటుంబం గురించి భయపడుతున్నాను అంటూ వాట్సప్లో మీడియాకు తెలపడం బీహార్లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో పాట్నా హైకోర్టు రాజ్ బల్లాల్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ బీహార్ ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించింది. దీని విచారణ శనివారం జరగనుంది.
 
ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లబ్ యాదవ్ పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ ద్వారా ఆ అమ్మాయిని అటకాయించి ఈ దారుణానికి దిగాడు. కాగా ఆర్జేడీ ఇప్పటికే రాజ్ బల్లబ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. శుక్రవారం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో రాజ్ బల్లబ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
మరిన్ని వార్తలు