బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ పోటీ చేసే స్ధానాలివే..

23 Dec, 2018 15:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీట్ల సర్ధుబాటును ఆదివారం ప్రకటించాయి. బిహార్‌లో ఎన్డీఏ కూటమిలోని మూడు కీలక పార్టీలు ఈ మేరకు అవగాహనకు వచ్చినట్టు వెల్లడించాయి. బిహార్‌లో బీజేపీ, జేడీ(యూ) చెరో 17 సీట్లలో పోటీ చేయనుండగా, ఎల్జేపీ ఆరు సీట్లలో బరిలో దిగనుంది. ఎల్జేపీ చీఫ్‌ రాం విలాస్‌ పాశ్వాన్‌ను ఎన్డీఏ రాజ్యసభకు నామినేట్‌ చేస్తుంది.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము 2014 ఎన్నికల కంటే మెరుగైన సామర్ధ్యం కనబరుస్తామని సీట్ల సర్ధుబాటును ప్రకటిస్తూ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ స్ధానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది త్వరలో వెల్లడిస్తామని సీట్ల సర్ధుబాటులో బీజేపీతో సమానంగా సీట్లను రాబట్టిన బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్ధానాలు సాధిస్తామని నితీష్‌ ధీమా వ్యక్తం చేశారు. తీవ్ర తర్జనభర్జనలు, సుదీర్ఘ చర్చల అనంతరం బిహార్‌లో ఎన్డీఏ కూటమి సీట్ల సర్ధుబాటును కొలిక్కితెచ్చారు.

కూటమిలో ఎల్జేపీ కొనసాగేందుకు వీలుగా ఆ పార్టీకి ఆరు స్ధానాలు కేటాయించడంతో పాటు పాశ్వాన్‌కు రాజ్యసభ సీటును ఆఫర్‌ చేశారు. మరోవైపు ఎన్డీఏ నుంచి ఉపేంద్ర కుష్వాహా సారథ్యంలోని ఆర్‌ఎల్‌ఎస్పీ వైదొలగడంతో పాశ్వాన్‌ను కూటమిలో కొనసాగేందుకు ఎన్డీఏ కసరత్తు చేసింది. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలే ఉన్న జేడీ(యూ)కు 17 స్ధానాలు కట్టబెట్టడమంటే ఎన్డీఏ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు