ఇంగ్లీష్‌ పరీక్ష రాస్తే.. సైకాలజీలో మార్కులు

16 Dec, 2017 16:46 IST|Sakshi

బిహార్‌ విద్యావ్యవస్థ మరోసారి అభాసు పాలైంది. మహమ్మద్‌ తాబ్రెజ్‌ అనే వ్యక్తి ఇంగ్లీష్‌ పరీక్ష రాస్తే.. తను సైకాలజీ పరీక్షను క్లియర్‌ చేసినట్టు ఫలితాలు వెలువడ్డాయి. కేవలం సబ్జెట్‌లో మాత్రమే కాక సైకాలజీ ప్రాక్టికల్స్‌లోనూ అతను పాస్‌ మార్కులు పొందినట్టు ఫలితాలు డిక్లేర్‌ అయ్యాయి. ఆ ఫలితాలను చూసుకున్న తాబ్రెజ్‌ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. భీమ్‌ రావ్‌ అంబేద్కర్‌ బిహార్‌ యూనివర్సిటీ(బీఆర్‌ఏబీయూ) నిర్వహించిన మహమ్మద్‌ తాబ్రెజ్‌ బీఏ పార్ట్‌-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్టు తెలిసింది. కానీ ఫలితాలే తికమకగా వచ్చాయి. అతను రాసిన ఇంగ్లీష్‌ హానర్స్‌లో కాకుండా సైకాలజీలో అతను పాసైనట్టు ఫలితాలు విడుదలయ్యాయి. తాబ్రెజ్‌ కనీసం అనుబంధ సబ్జెట్‌లుగా కూడా సైకాలజీని ఎంచుకోలేదు. జియోగ్రఫీ, హిస్టరీలు మాత్రమే ఆయన అనుబంధ సబ్జెట్‌లు. మార్కు షీటులో వచ్చిన ఫలితాలను చూసుకున్న తాబ్రెజ్‌ వెంటనే, ఎగ్జామినేషన్‌ వింగ్‌ను ఆశ్రయించాడు. అయితే అది యూనివర్సిటీ తప్పిదమని, 128 కిలోమీటర్ల దూరంలో ముజఫర్పూర్‌లో ఉన్న బీఆర్‌ఏబీయూ ప్రధాన  కార్యాలయాన్ని ఆశ్రయించాలని కాలేజీ అధికారులు సూచించారని విద్యార్థి చెప్పాడు. 

బీఆర్‌ఏబీయూ ఉద్యోగులు కూడా తమ తప్పిదాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరని, ఎగ్జామినేషన్‌ దరఖాస్తులోనే ఈ తప్పు జరిగి ఉంటుందని వాదిస్తున్నారని పేర్కొన్నాడు.  వెస్ట్‌ చమప్రన్ జిల్లాలోని బెట్యాలో గల రామ్ లఖన్ సింగ్ యాదవ్ కాలేజీలో బీఏ చదువుతున్నానని, అడ్మిట్‌ కార్డు నెంబర్‌ 104762 తనకు జారీ అయిందని, ఇంగ్లీష్‌ హానర్స్‌, జియోగ్రఫీ, హిస్టరీ సబ్జెట్‌ల్లో తాను పరీక్ష రాసినట్టు తాబ్రెజ్‌ ధృవీకరించాడు. ఇటీవల బీఆర్‌ఏబీయూ చేస్తున్న తప్పిదాలకు బలవుతున్న విద్యార్థుల్లో తాబ్రెజ్‌ ఒక్కడే కాదని, ఇలా చాలామందికి మార్కుషీటుల్లో  ఇలాంటి తప్పులు దొర్లినట్టు వెల్లడైంది. 

మరిన్ని వార్తలు