స్పెషల్‌ రైళ్లు వేయండి: సుశీల్‌ మోదీ

1 May, 2020 13:56 IST|Sakshi

పట్నా: దేశంలోని వివిధ ప్రాంతాలను నుంచి తమ పౌరులను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కేంద్రాన్ని బిహార్‌ ప్రభుత్వం కోరింది. లాక్‌డౌన్‌ కారణంగా తమ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయారని బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న బిహార్‌ వలస  కార్మికులు, విద్యార్థులను తమ రాష్ట్రానికి తరలించేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన లక్షలాది మంది వలస కార్మికులు, విద్యార్థులను బస్సుల్లో తీసుకురావడం సాధ్యం కాదు. బస్సుల ద్వారా వీరిని తరలించడం ఖర్చుతో కూడుతున్నదే కాకుండా కొన్ని నెలల సమయం పడుతుంది. ఒక్కో ట్రిప్పుకు బస్సులు ఆరు నుంచి రోజులు సమయం తీసుకుంటాయి. కాబట్టి ప్రత్యేక రైళ్లతో భౌతిక దూరం పాటిస్తూ వారిని తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామ’ని సుశీల్‌ కుమార్‌ మోదీ తెలిపారు. వలస కార్మికులు, విద్యార్థులను ఇక్కడికి తరలిస్తే వారిని క్వారెంటైన్‌ చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ సహాయం కోసం 27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బిహారీలను లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించే వరకు తీసుకురావడం కుదరదని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఇంతకుముందు ప్రకటించారు. (సైకిల్‌పై భార్యతో కలిసి 230 కి.మీ ప్రయాణం)

>
మరిన్ని వార్తలు