పసికందుపై అకృత్యం.. వలస కూలీలపై దాడులు

7 Oct, 2018 14:08 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ల నుంచి తమ రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలపై గుజరాతీలు దాడులకు పాల్పడుతున్నారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన 14 నెలల చిన్నారిపై వారం రోజుల కిందట బిహార్‌కు చెందిన వలస కూలీ అత్యాచారానికి పాల్పడటంతో వారంతా దాడులకు దిగుతున్నారు. ఫలితంగా గాంధీనగర్‌, అహ్మదాబాద్‌, పటాన్‌, సబర్‌కాంత, మెహ్సానా ఏరియాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వలస కూలీలంతా తమ తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు భారీగా రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్న సుమారు 150 మందిని అరెస్టు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ శివానంద్‌ ఝా తెలిపారు. అదే విధంగా ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, వలస కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా ఈ దాడులకు ఠాకూర్‌ సేన కారణమంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకుడు, ఠాకూర్‌ సేన అధినేత అల్పేశ్‌ ఠాకూర్‌ వివరణ ఇచ్చారు. తాము శాంతిని మాత్రమే ప్రోత్సహిస్తామని, ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు