రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు

16 Jul, 2019 04:09 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రమాదానికి కారణమైన వాహన యజమాని నుంచి బాధితులకు ఈ మొత్తాన్ని ఇప్పిస్తారు. ఈ బిల్లుకు గత లోక్‌సభలోనే ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందక గడువు చెల్లిపోయింది. దీంతో మళ్లీ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం అందించే మంచి వ్యక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటం తదితర కొత్త నిబంధనలను బిల్లులో కేంద్రం చేర్చింది. ఈ బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలిగిస్తోందని తృణమూల్‌ ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్‌ పక్ష నాయకుడు అధిర్‌చౌధురీ ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లులోని నిబంధనలను అమలు చేయాలో లేదో పూర్తిగా రాష్ట్రాల ఇష్టమనీ, అయితే మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అందరూ ఆమోదం తెలపాలని రవాణా మంత్రి గడ్కరీ కోరారు.

మరిన్ని వార్తలు