మోడీ సర్కార్ తొలి చట్టం

10 Jul, 2014 03:00 IST|Sakshi

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బిల్లు ఆమోదం
 
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) సంస్థ జాతీయ ప్రాముఖ్యం గల సంస్థగా రూపుదాల్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు బుధవారం పార్లమెంట్ ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీనితో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తొలి చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినట్టయింది. గత సోమవారం రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. బిల్లు ఆమోదంతో, వివిధ కోర్సులలో విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసేందుకు ఎన్‌ఐడీకి అధికారం లభించింది. దీంతో  ఎన్‌ఐడీ జాతీయ స్థాయి సంస్థగా రూపుదాల్చుతుందని, విద్యార్థులకు పీజీ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్‌డీ డిగ్రీలను అందిస్తుందని కేంద్రవాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు.

హైదరాబాద్‌లోనూ ఎన్‌ఐడి: నర్సయ్య గౌడ్

అంతకు ముందు బిల్లుపై జరిగిన చర్చలో టీఆర్‌ఎస్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొంటూ, ఎన్‌ఐడీని హైదరాబాద్‌లో కూడా నెలకొల్పాలని మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. హైదరాబాద్‌కు మంజూరైన ఎన్‌ఐడీని విజయవాడకు తరలిస్తున్నట్టు ఇటీవలే కేంద్రం ప్రకటించిందన్నారు. విజయవాడకు ఎన్‌ఐడీని తరలించినప్పటికీ.. హైదరాబాద్‌లో కూడా మరో ఎన్‌ఐడీని ఏర్పాటుచేయాలని కోరారు.
 

మరిన్ని వార్తలు