ఒక కోటీశ్వరుడు = ఒక రాష్ట్రం

27 Jan, 2019 02:14 IST|Sakshi

దేశంలో ఒక్కో బిలియనీర్‌ ఒక్కో రాష్ట్ర జీడీపీకి సమానం

52 శాతం దేశ సంపద 9 మంది చేతుల్లోనే!

దిగువనున్న 60 శాతం జనాభా దగ్గర ఉన్నది 5 శాతమే

అంతర్జాతీయ అసమానతలపై ఆక్స్‌ఫాం–19లో వెల్లడి

మన దేశం ఒకవైపు ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. మరోవైపు దేశంలో ‘కొందరి’వ్యక్తిగత ఆస్తులు లక్షల కోట్లకు పెరుగుతున్నాయి. కొంతమంది సంపద విలువ ఒక రాష్ట్రం లేదా కొన్ని రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి విలువతో సమానం లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. అంటే ఒక్కో కోటీశ్వరుడు ఒక రాష్ట్ర జీడీపీతో సమానమన్న మాట. ఉదాహరణకు ముకేశ్‌ అంబానీ ఆస్తుల నికర విలువ 3.3 లక్షల కోట్లు. ఇది ఒడిశా రాష్ట్ర జీడీపీ (3.46 లక్షల కోట్లు)కి దాదాపు సమానం. అజిమ్‌ ప్రేమ్‌జీ సంపద గోవా, త్రిపుర, పాండిచ్చేరిల మొత్తం జీడీపీ కంటే కూడా పది వేల కోట్లు ఎక్కువ. ‘ఇండియా స్పెండ్‌’విశ్లేషణ ప్రకారం మన దేశంలో పది మంది అత్యంత ధనవంతుల మొత్తం ఆస్తి కొన్ని రాష్ట్రాల జీడీపీతో సమానం. దేశంలో కేవలం తొమ్మిది మంది కోటీశ్వరుల సంపద దేశ జనాభాలో ఆదాయం రీత్యా దిగువ 50 శాతం మంది మొత్తం సంపదతో సమానమని అంతర్జాతీయ అసమానతలపై ఆక్స్‌ఫాం నివేదిక– 2019 స్పష్టం చేసింది. దేశ సంపదలో 52 శాతం 9 మంది వద్దే ఉంది. ఆర్థికపరంగా దిగువన ఉన్న 60 శాతం జనాభా దగ్గర కేవలం 5 శాతం సంపద మాత్రమే ఉంది. సాధారణంగా ఇతర దేశాల్లో సంపదంతా జనాభాలో ఒక శాతం మంది దగ్గరే ఉంటుంది. అదే 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఇది కేవలం తొమ్మిది మంది (0.000000075%) దగ్గరే ఉంది.

1982–83లో ఆదాయం రీత్యా పైనున్న ఒక శాతం జనాభా ఆదాయం మొత్తం దేశం ఆదాయంలో 6 శాతం ఉంది. 1992–93 నాటికది 10 శాతానికి పెరిగింది. 2000 నాటికి 15 శాతం కాగా, 2014 నాటికి దాదాపు 23 శాతానికి పెరిగింది. దేశం మొత్తం ఆదాయంలో పైనున్న ఒక శాతం జనాభా అత్యధిక వాటా కలిగిన దేశాల్లో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది. బ్రెజిల్, టర్కీ, జాంబియా మొదటి స్థానాల్లో ఉన్నాయి. 2018లో దేశంలో కోటీశ్వరుల సంపద 35 శాతం పెరిగింది. అంటే రోజుకు 2,200 కోట్లు చొప్పున పెరిగింది.

ముకేశ్‌ అంబానీ..
2017–18 లెక్కల ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఆస్తుల నికర విలువ రూ.3,31,525 కోట్లు. ఇది ఒడిశా జీడీపీకి దాదాపు సమానం. ఒడిశా జీడీపీ 3,46,294 కోట్లు. ఈశాన్య రాష్ట్రాల మొత్తం జీడీపీ కలిపినా కూడా అంబానీ సంపద కంటే చాలా తక్కువ.

అజిమ్‌ ప్రేమ్‌జీ...
విప్రో అధినేత ప్రేమ్‌జీ ఆస్తుల విలువ 1,47,189 కోట్లు. గోవా, త్రిపుర, పుదుచ్చేరి జీడీపీ కంటే ఇది పది వేల కోట్లు అధికం.

లక్ష్మీ మిట్టల్‌...
ఉక్కు పరిశ్రమ ఆర్సెల్‌ మిట్టల్‌ సీఈవో లక్ష్మీ మిట్టల్‌ ఆస్తుల విలువ రూ.1,28,264 కోట్లు. ఇది హిమాచల్‌ప్రదేశ్‌ జీడీపీ (రూ.1.52 లక్షల కోట్లు) కంటే కొంచెం తక్కువ.

హిందూజా..
హిందూజాల నికర సంపద రూ.1,26,162 కోట్లు. ఉత్తరా ఖండ్‌ జీడీపీ (రూ.2.58 లక్షల కోట్లు)లో ఇది సగం ఉంది.

పల్లోంజి మిస్త్రీ...
153 ఏళ్ల చరిత్ర గల షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపు చైర్మన్‌ మిస్త్రీకి రూ.1,10,041 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇది గోవా జీడీపీ (రూ.70,400 కోట్లు) కంటే దాదాపు 40,000 కోట్లు ఎక్కువ.

శివనాడార్‌...
హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ నాడార్‌ ఆస్తుల విలువ 1,02, 331 కోట్లు. 2018లో ఫోర్బ్స్‌ 100 మంది ధనవంతుల జాబి తాలో 4వ స్థానంలో నిలిచారు. ఈయన ఆస్తుల విలువ జార్ఖండ్‌ జీడీపీ(రూ.2.82లక్షల కోట్లు)లో దాదాపు సగం.

గోద్రేజ్‌...
గోద్రేజ్‌ గ్రూపు మొత్తం ఆస్తుల విలువ రూ.98,126 కోట్లు. ఇది గోవా జీడీపీ (రూ.70,400 కోట్లు) కంటే 25 వేల కోట్లు ఎక్కువ.

దిలీప్‌ సంఘ్వి...
సన్‌ ఫార్మాస్యుటికల్స్‌ వ్యవస్థాపకుడు దిలీప్‌ సంఘ్వికి రూ.88,313 కోట్ల విలువైన సంపద ఉంది. ఇది మేఘాలయ జీడీపీ రూ.24,202 కోట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువ.

కుమార మంగళం..
బిర్లా సంస్థ అధినేత కుమార మంగళం బిర్లా నికర ఆస్తుల విలువ రూ.87,612 కోట్లు. సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌ల మొత్తం జీడీపీ కంటే ఇది దాదాపు పది వేల కోట్లు అధికం.

గౌతం అదానీ...
అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు గౌతం అదానీ సంపద విలువ రూ.83,407 కోట్లు. ఇది కూడా నాలుగు ఈశాన్య రాష్ట్రాల జీడీపీ కంటే ఎక్కువే.

మరిన్ని వార్తలు