వైరల్‌ : తీరంలో వెలుగులు; ప్రమాదానికి సంకేతం..!

19 Aug, 2019 20:13 IST|Sakshi

సాక్షి, చెన్నై : సముద్ర తీరంలో కాసేపు సేద తీరితే ఎవరికైనా ఉల్లాసంగా ఉంటుంది. అక్కడ రంగురంగుల కాంతులు కూడా ఉంటే డబుల్‌ ఖుష్‌ లభించినట్టే..! చెన్నైలోని బంగాళాఖాతం తూర్పు తీరంలో ఆదివారం రాత్రి కనిపించిన ఓ దృశ్యం టూరిస్టులను తెగ ఆకట్టుకుంది. సముద్రం అలలపై నీలం రంగు కాంతి తేలియాడుతూ వస్తుంటే అక్కడున్న వారందరూ ఎంజాయ్‌ చేశారు. సహజసిద్ధమైన ఈ దృశ్యాన్ని కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌ అయింది. తిరువాన్‌మియూర్‌, ఇంజామ్‌బాక్కం బీచ్‌లో ఈ వింత వెలుగు చూసింది. బెసంత్‌ నగర్‌ బీచ్‌తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ కాంతి వెలుగులు కనిపించినట్టు స్థానికులు తెలిపారు.

అయితే, ఈ ఆహ్లాదభరిత కాంతులు ప్రమాదానికి సంకేతమని సముద్ర నిపుణులు అంటున్నారు. ఇది బయోల్యూమినస్ కాంతిగా చెప్తున్నారు. కోస్టల్‌ రిసోర్స్‌ సెంటర్‌ అధికారి పూజా కుమార్ మాట్లాడుతూ.. ‘తుమ్మెదలు, బీటిల్స్, ఆంగ్లర్‌ఫిష్, జెల్లీ ఫిష్ వంటి సముద్ర జీవులతో పాటు నాక్టీలియా ఆల్గే వల్ల ఈ బయోల్యూమినస్ కాంతి పుట్టుకొస్తుంది. అయితే, ఈ ఆల్గే  వల్ల సముద్రంలో భారీ మొత్తంలో అమ్మోనియా పేరుకుపోతుంది. అది సముద్ర జీవులకు మంచిది కాదు. అమ్మోనియా వల్ల సముద్ర జీవుల ఆహార చక్రం నాశనం అవుతుంది. ఫలితంగా చేపల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అది చేపల ఆహారంలో బాగమైన ప్లాంక్టోన్‌ను కూడా నాక్టీలియా ఆల్గే తినేస్తుంది. ఆక్సిజెన్‌ లేని ప్రాంతాల్లోనే ఈ ఆల్గే పుట్టుకొస్తుంది. తీర ప్రాంతాలు కాలుష్యమవడం దీనికి కారణం’అన్నారు.

మరిన్ని వార్తలు